గచ్చిబౌలిలోని ప్రభుత్వ పాఠశాలలో మరమ్మతుల గురించి కేసీఆర్ మానవడు, కేటీఆర్ కొడుకు హిమాన్షు చేసిన ఎమోషనల్ స్పీచ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. ఆయన చేసిన మంచి పనికి ఒక వైపు ప్రశంసలు కురిపిస్తుండగా.. మరో వైపు ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపడానికి ఇదొక అస్త్రంగా మారిపోయింది. దీంతో హిమాన్షు చేసిన సత్కార్యం తాత కేసీఆర్‌కు చిక్కులు తెచ్చిపెట్టిందని చెబుతున్నారు.
మహేష్ బాబు సినిమా శ్రీమంతుడు చాలా మందికి గుర్తే ఉంటుంది. తిరిగి ఇచ్చేయాలి అంటూ ఆ సినిమాలో చెప్పే డైలాగ్ కూడా అంతే ఫేమస్. స్వయంగా సహాయం చేయాలి అనేది ఈ సినిమాలో మనకు కనిపించే ప్రధాన అంశం. ఇప్పుడు తెలంగాణ సీఎం కేసీఆర్ మనవడు కల్వకుంట్ల హిమాన్షు రావుపై ‘శ్రీమంతుడు’ అంటూ ప్రశంసలు వస్తున్నాయి. ఆ సినిమాలో మహేశ్ బాబు క్యారెక్టర్‌తో హిమాన్షును పోలుస్తూ సోషల్ మీడియాలో పొగడ్తల వర్షం కురుస్తున్నది. గచ్చిబౌలి సమీపంలోని కేశవనగర్ ప్రభుత్వ పాఠశాలలో మరమ్మతులకు ఆయన పాటుపడటం.. పాఠశాలలో మౌలిక వసతుల దుస్థితి చూస్తే కంట నీరు వచ్చిందని హిమాన్షు స్వయంగా ఉద్వేగంగా చెప్పడం రాజకీయ దుమారాన్ని లేపాయి.
స్కూల్‌లో హెడ్ మాస్టర్ ఆఫీసు రూమ్‌లోనూ స్టూడెంట్లు ఉండటం.. ఇదేంటని హెచ్ఎంను అడగ్గా.. ఇదే ఆఫీసు, ఇదే స్టాఫ్ రూం, ఇదే క్లాస్ రూం, ఇదే స్టోర్ రూం అంటూ వచ్చిన సమాధానం విని నిర్ఘాంతపోయినట్టు హిమాన్షు చెప్పారు. గర్ల్స్ టాయిలెట్ల దగ్గర పందులుండేవని, అలాగైతే వారు వాష్‌రూమ్ ఎలా యూజ్ చేసుకోగలుగుతారని బాధపడ్డట్టు వివరించారు. అందుకే ఎలాగైనా స్కూల్‌లో మార్పులు తీసుకురావాలని, మౌలిక సదుపాయాలు కల్పించాలని కంకణం కట్టుకున్నట్టు చెప్పారు. తాను ప్రైవేట్ స్కూల్‌లో చదవడం మూలంగా ఇవన్నీ ఆయనకు కొత్తగా కనిపించినట్టు వివరించారు. ఆ తర్వాత ఫండ్ రైజ్ చేసి మరమ్మతులు చేపించినట్టు పేర్కొన్నారు. ఇక్కడి పరిస్థితులు చూస్తే తనకు ఏడుపొచ్చిందని బాధపడ్డారు.
హిమాన్షు ఎమోషనల్ స్పీచ్ అదిరింది. చాలా మంది ఆయన చేసిన మంచి పనిని మెచ్చుకున్నారు. ఆయన తీరుపై హర్షం వ్యక్తం చేశారు. కానీ, తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలలు ఇంత ధైన్యస్థితిలో ఉన్నప్పుడు రాష్ట్ర విద్యాశాఖ ఏం చేస్తున్నది? అనే ప్రశ్నలను లేవదీస్తున్నాయి. ప్రతిపక్షాలో, ప్రభుత్వ విమర్శకులో కాదు.. స్వయంగా సీఎం కేసీఆర్ మనవడే ప్రభుత్వ పాఠశాలలోని అవస్థలను చూసి కన్నీరు పెట్టుకున్నారని ఎత్తిచూపుతున్నారు. హెచ్ఎం మొదలు.. విద్యాశాఖ సెక్రెటరీలు, విద్యా శాఖ మంత్రి, చివరకు ముఖ్యమంత్రి వరకు ఈ దుస్థితిని పట్టించుకోకపోవడాన్ని నిలదీస్తున్నారు. హిమాన్షు అంత కష్టపడి ఫండ్ రైజ్ చేసి మరమ్మతులకు పూనుకునేవరకు ప్రభుత్వ యంత్రాంగం, ప్రభుత్వం ఏం చేస్తున్నదని ప్రశ్నిస్తున్నారు. కేవలం కేశవనగర్ స్కూల్‌లోనే ఈ పరిస్థితులు ఉన్నాయా? రాజధాని నగరంలోనే కూతవేటు దూరంలోని స్కూల్‌లో ఈ దుస్థితి ఉంటే రాష్ట్ర మారుమూల ప్రాంతాల్లో ఇంకెన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంకెంతటి దురవస్తలో ఉండి ఉంటాయంటూ ప్రశ్నిస్తున్నారు.
కేశవనగర్ స్కూల్ ఎపిసోడ్‌తో హిమాన్షుపై అభిమానం పెరిగినా.. ఆయన సొంతంగా మైలేజ్ సంపాదించుకున్నా.. తాత కేసీఆర్‌కు పరోక్షంగా చిక్కులు తెచ్చిపెట్టినట్టే తెలుస్తున్నది. హిమాన్షును మెచ్చుకుంటూ ప్రభుత్వంపై ప్రశ్నలు వేస్తుండటమే దీనికి ఉదాహరణగా కనిపిస్తున్నది. ఈ పరిణామాన్ని ప్రతిపక్ష పార్టీలు ఉపయోగించుకుంటున్నాయి.
