హైదరాబాద్: సినీ హీరో ప్రభాస్ కు హైకోర్టులో చుక్కెదురైంది. హైదరాబాదులోని రాయదుర్గంలో ఆయనకు చెందిన 2,083 చదరపు గజాల స్థలంలో నిర్మాణాలపై యథాతథ స్థితిని కొనసాగించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ స్థలానికి సంబంధించిన వివాదంలో నిరుడు ఏప్రిల్ 23వ తేదీన ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు బెంచ్ ప్రస్తావించింది. 

ఆ ఆదేశాల మేరకు అధికారులు స్వాధీనం చేసుకున్న ఆస్తులపై యథాతథ స్థినతిని కొనసాగించాలని, ఏ విధమైన కూల్చివేతలు కూడా చేపట్టరాదని స్పష్టం చేసింది. ఆ ఆస్తిని పిటిషనర్ కు స్వాధీన పరచాల్సిన అవసరం లేనది, వాటిని రెవెన్యూ అధికారుల ఆధినంలో ఉంచాలని తెలిపింది. 

స్థల యాజమాన్యం హక్కుల కోసం సివిల్ కోర్టులో ప్రభాస్ న్యాయపోరాటం చేయవచ్చునని తెలిపింది. ఈ ఉత్తర్వులు అమలులో ఉండగా ప్రభాస్ రంగారెడ్డి జిల్లా కోర్టు నుంచి ఇంజక్షన్ ఉత్తర్వులు తెచ్చుకుని ఆస్తులను స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించారు. దాంతో అధికారులు హైకోర్టుకు వెళ్లారు. 

ఆ పిటిషన్ ను విచారించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాఘవేంద్ర సింగ్ చౌహాన్ నేతృత్వంలోని బెంచ్ గతంలో ఇచ్చిన ఆదేశాలే అమలులో ఉంటాయని స్పష్టం చేసింది. కోర్టు ఉత్తర్వులు ప్రభావితం కాకుండా జిల్లా కోర్టు ఇచ్చిన ఇంజక్షన్ ఆేదశాలపై దాఖలు చేసిన స్టే వెకేట్ పిటిషన్ తో సహా భూవివాద వ్యాజ్యాలను వెంటనే పరిష్కరించాలని సూచించింది.