హైదరాబాద్: తీవ్ర సంచలనం సృష్టించిన అవంతిక భర్త హేమంత్ కుమార్ పరువు హత్య కేసుోల నిందితులకు హైకోర్టు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. వారు దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్లను హైకోర్టు తోసిపుచ్చింది. నిందితులు రంజిత్ రెడ్డి, రాకేష్ రెడ్డి, రజిత, కె. సంతోష్ రెడ్డి, సందీప్ రెడ్డి, సత్య, స్వప్న, సాహెబ్ పటేల్, గూడూరు సందీప్ రెడ్డిలు బెయిల్ కోసం పిటిషన్లు దాఖలు చేసుకున్నారు. 

Also Read: హేమంత్ హత్య: సుఫారీ గ్యాంగ్‌కి చెందిన నలుగురి అరెస్ట్

వారి బెయిల్ పిటిషన్లను హైకోర్టు కొట్టేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కె. లక్ష్మణ్ బుధవారం ఆదేశాలు జారీ చేశారు. హేమంత్ కుమార్ హత్య కేసులో తమ క్లయింట్ల పాత్ర లేదని నిందితుల తరఫున న్యాయవాదులు కోర్టుకు విన్నవించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి మాట్లాడేందుకు పిలువాలని అడిగితే మాత్రమే అక్కడికి వెళ్లారని చెప్పారు.

నిందితుల తరఫు న్యాయవాదుల వాదనలను పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రతాప్ రెడ్డి వ్యతిరేకించారు. ఈ కేసులో నిందితులందరికీ సమాన పాత్ర ఉందని చెప్పారు. హేమంత్ హత్య ఓ పథకం ప్రకారం జరిగిందని చెప్పారు. ఇందులో కుట్ర కోణం ఉందని ఆయన వాదించారు. నిందితులందరికీ ఒకే శిక్ష పడే అవకాశం ఉందని చెప్పారు. 

Also Read: జైల్లోనే...హేమంత్ హత్యకేసులో నిందితుడికి కరోనా

భారతదేశంలో కులవ్యవస్థ నిర్మూలనకు ప్రయత్నాలు జరుగుతుంటే పరువు హత్యలు చేయడాన్ని క్షమించరాది 2006లోనే సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని ఆయన గుర్తు చేశారు. నిందితులకు బెయిల్ ఇవ్వకూడదని ఆయన హైకోర్టును కోరారు. పోలీసులు నిందితులకు వ్యతిరేకంగా అన్ని సాక్ష్యాధారాలు సేకరించినట్లు తెలిపారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలతో ఏకీభవించిన హైకోర్టు నిందితుల బెయిల్ పిటిషన్లను కొట్టేసింది.