హీరా గోల్డ్‌ బాధితులకు త్వరలోనే చెల్లింపులు ప్రారంభిస్తామన్నారు ఆ సంస్థ అధినేత నౌహీరా షేక్. శనివారం మీడియాతో మాట్లాడిన ఆమె సంస్థకు రూ. వేల కోట్ల ఆస్తులు వున్నాయని స్పష్టం చేశారు.

హీరా గోల్డ్ ఎవరినీ మోసం చేసే ప్రయత్నం చేయడం లేదని.. హీరా గోల్డ్‌పై నమ్మకం లేనివాళ్లే ఫిర్యాదు చేశారని ఆమె ఆరోపించారు. హీరా గోల్డ్‌ను అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని నౌహీరా సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఒవైసీ బృందం తనను టార్గెట్ చేసి కేసు పెట్టిందని ఆమె ఆరోపించారు. షేక్‌పేట్‌లోని తన భూమిని కబ్జా చేయాలని కొందరు చూశారని నౌహీరా వెల్లడించారు. భ్యూ వ్యవహారంలో కొందరు బెదిరింపులు, బ్లాక్‌మెయిల్‌లు చేస్తున్నారని ఆమె తెలిపారు. చిన్న కేసు పెట్టి మహారాష్ట్రలో అరెస్ట్ చేశారని.. పెద్ద పెద్ద క్రిమినల్స్‌కు మించి తనను రిమాండ్ చేశారని నౌహీరా ఆరోపించారు.

కాగా, స్కీముల పేరిట రూ.వేల కోట్లు స్వాహా చేసినట్లు నౌహీరా షేక్‌పై అభియోగాలున్న సంగతి తెలిసిందే. అక్రమంగా డిపాజిట్ల సేకరణ, విదేశీ బ్యాంకు ఖాతాల నిర్వహణ ఆరోపణలతో తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటక సహా పలు రాష్ట్రాల్లో కేసులు ఉన్నాయి