తెలంగాణలోని పలు జిల్లాల్లో ఆది,సోమ,మంగళవారాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ ప్రకటించింది.
హైదరాబాద్: తెలంగాణలో ఆది, సోమ, మంగళవారాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఇవాళ వాయువ్య, పశ్చిమ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని... దీని ప్రభావంతోనే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ, మరికొన్ని ప్రాంతాల్లో సాధారణ వర్షపాతం నమోదవుతుందని వెల్లడించారు. రానున్న ఐదురోజుల పాటు పగటిపూట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదు కానున్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది.
అల్పపీడన ప్రభావంతో ఆదివారం ఆదిలాబాద్, సంగారెడ్డి, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, ఖమ్మం, నల్గొండ, మహబూబాబాద్, సిద్దిపేట, వికారాబాద్, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయని హెచ్చరించారు. అలాగే హైదరాబాద్ లోనూ వర్షం కురవనుందని తెలిపారు.
read more మూడు రోజులు ఏపీలో భారీ వర్షాలు..
భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని ప్రభుత్వ యంత్రాంగాన్ని వాతావరణ శాఖ సూచించింది. వరద నీటితో నదులతో పాటు వాగులు, వంకలు పొంగిపొర్లే అవకాశాలుంటాయి కాబట్టి లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సూచించారు. అలాగే రవాణా వ్యవస్థ స్తంభించకుండా, విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగి ప్రజలు ఇబ్బందిపడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
