ఏపీ, తెలంగాణలకు మరో రెండు రోజులు భారీవర్ష సూచన: ఆందోళనలో లోతట్టు ప్రాంత వాసులు

మరో రెండు రోజుల పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాస్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వార్నింగ్ ఇచ్చింది. దాదాపుగా నాలుగు రోజులుగా రెండు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. దీంతో లోతట్టుప్రాంతాల ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. 

Heavy Rains For Next Two Days In AP And Telangana


హైదరాబాద్:ఈనెల 15 వ తేదీ వరకు తెలంగాణలోభారీ వర్షాలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా  ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. 

తెలంగాణలోని పలు జిల్లాల్లో రెండు మూడు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి.  వర్షాల కారణంగా  పలు జిల్లాలోని లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగాయి. ఇంకా రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. రానున్న   రెండు రోజుల పాటు  అవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుండి బయటకు రావొద్దని అధికారులు సూచిస్తున్నారు. 

బుధవారం నాడు రాత్రి హైద్రాబాద్ నగరంలో భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో నగర వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. దీంతో  పెద్ద ఎత్తున వర్షం నీరు రోడ్లపై నిలిచింది.  ఈ నెల 9వ తేదీన నగరంలో భారీ వర్షం కురిసింది. నగరంలో సుమారు 16సెం.,మీ వర్షపాతం నమోదైంది. అయితే బుధవారం నాడు రాత్రి  10 సెం.మీ వర్షపాతం నమోదైందని  అధికారులు చెబుతున్నారు. నగరంలోని పలు ప్రాంతాల్లో సగటున 6 సెం.మీ వర్షపాతం రికార్డైనట్టుగా అధికారులు వివరించారు.

హైద్రాబాద్ నగరంలో నిన్న రాత్రి బాలానగర్ లో 10.4 సెం.మీ, బొల్లారంలో9.6 సెం.,మీతిరుమలగిరిలో 9.5 సెం.మీ, వెస్ట్ మారేడ్ పల్లిలో 9.3 సెం.మీ,కుత్బుల్లాపూర్ లో 7.7 సెం.మీ, మూసాపేటలో 7.6 సెం.మీ.కొండాపూర్ లో 7.4 సెం.మీ,  మల్కాజిగిరిలో 7 సెం.మీ  వర్షపాతం నమోదైంది. ఇక సిద్దిపేట జిల్లాలోని  రామారంలో 16 సెం.మీ వర్షపాతం రికార్డైంది.సంగారెడ్డి జిల్లాలోని కిష్టారెడ్డిపేటలో 13.4 సెం.మీ, రంగారెడ్డి జిల్లా పొద్దుటూరులో 10.4 సెం.మీ, కొత్తూరులో 9.2 సెం.మీ. వర్షపాతం నమోదైంది. 

నగరంలోని బోరబండ, సంతోష్ నగర్, ఖైరతాబాద్, ఎల్బీనగర్, చాదర్ ఘాట్,బాలానగర్, జీడిమెట్ల  తదితర ప్రాంతాల్లో భారీ  వర్షం కురిసింది.  బోరబండలోని అపార్ట్ మెంట్ సెల్లార్లలోకి వర్షం నీరు చేరింది. బోరబండలో  టూవీలర్లు, ఆటోలు  వరద నీటిలో కొట్టకుపోయాయి. భారీ వర్షానికి నగరంలో రోడ్లపైనే గంటల తరబడి ట్రాఫిక్ నిలిచిపోయింది. వరద నీరు రోడ్లపై నిలిచిపోవడంతో వాహనదారులు తమ గమ్యస్థానాలు చేరుకోవడానికి అవస్థలు పడ్డారు. 

also read:రెండు తెలుగు రాష్ట్రాల్లో మ‌రో 3 రోజులు మోస్తారు నుంచి భారీ వ‌ర్షాలు

రంగారెడ్డి జిల్లాలోని పలు చోట్ల కూడ భారీ వర్షం కురిసింది. ఈ భారీ వర్షం తో లోతట్టు ప్రాంతాలు నీటిలో మునిగాయి.  మహబూబ్ నగర్ లో  భారీ వర్షంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు.  బుధవారం నాడు రాత్రి కురిసిన వర్షానికి  పలు ప్రాంతాలు నీటిలో మునిగాయి. రామయ్య బౌలి, బీకే రెడ్డి కాలనీ, శివశక్తి నగర్ కాలనీల్లో భారీ వర్షానికి   వరద   ఇళ్లలోకి  చేరింది.   మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో ఉన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్  అధికారులతో ఫోన్లో మాట్లాడారు. వరద నీరు కాలనీల్లోకి రాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. 


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ వర్షాలు

ఆంధ్రప్రదేశ్  రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రెండు రోజులుగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలతో  లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.  అనంతపురం పట్టణంలోని పలు కాలనీల్లో వరద నీరు చేరింది. ఈ కాలనీల్లో ని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.  సహాయక చర్యల్లో పలు పార్టీల నేతలు పాల్గొంటున్నారు. వరద బాధిత ప్రజలకు ఆహారం, మంచినీరు అందిస్తున్నారు.  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఇంకా రెండు రోజుల పాటు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వార్నింగ్ ఇచ్చింది. దీంతో లోతట్టు ప్రాంత ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.  రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులకు వరద పోటెత్తింది.దీంతో ప్రాజెక్టుల గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios