హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ(బుధవారం) రాజధాని హైదరాబాద్ లో అయితే వర్షం దంచికొట్టింది. దీంతో లోతట్టు ప్రాంతాలతో పాటు ప్రధాన రహదారుల్లో కూడా వర్షపు నీరు భారీగా నిలిచింది. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులకు ఎందుర్కొంటున్నారు. 

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం బలహీనపడి అల్పపీడనంగా మారిందని...దీని ప్రభావంతో రాష్ట్రంలోని అనేకచోట్ల మోస్తరు నుంచి భారీవర్షాలు కురుస్తాయని ఇప్పటికే వాతావరణ శాఖ ప్రకటించింది. ఈనెల 19 వరకు రాష్ట్రంలో వర్షాలు కొనసాగుతాయని...20న ఈశాన్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ పేర్కొంది. దీని ప్రభావంతో వర్షాల తీవ్రత మరింత పెరగనుందని అన్నారు. 

read more  అనంతగిరిని ముంచేత్తిన వరద: నిలిచిపోయిన రకుల్ ప్రీత్ షూటింగ్

తెలంగాణలో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. దీంతో రెండ్రోజులుగా పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలో కురుస్తున్న కుంభవృష్టితో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వరద నీటితో ప్రాజెక్టులన్నీ జలకళను సంతరించుకున్నాయి. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా వుండాలని అధికారులు సూచిస్తున్నారు.