హైదరాబాద్ లో మరోసారి వరుణుడు బీభత్సం సృష్టించాడు. మంగళవారం రాత్రి నగరంలోని పలుచోట్ల భారీ వర్షం కురిసింది.
భాగ్యనగరంపై వరుణుడి పగ చల్లారినట్టులేదు. ఇది వనకాలమో .. ఎండ కాలమో తెలియని విధంగా వాన దేవుడు మరోసారి విరుచుకు పడుతున్నాడు. మంగళవారం రాత్రి హైదరాబాద్ లో మరోసారి భారీ వర్షం కురుస్తోంది. పలు ప్రాంతాల్లో వాన దంచికొట్టడంతో రోడ్లపై ఎక్కడికక్కడ వాననీరు చేరుకుంది. దీంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. పలు చోట్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
భారీ వర్షం
మంగళవారం రాత్రి (మే 9వ తేదీ) ఆకస్మికంగా వాతావరణంలో మార్పులు ఏర్పడ్డాయి. దీంతో ఒక్కసారిగా కుండపోత వర్షం కురిసింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అమీర్ పేట్, ఎస్సార్ నగర్, ఐఎస్ సదన్, గచ్చిబౌలి, మియాపూర్, మాదాపూర్, కొండాపూర్,సరూర్ నగర్ వంటి తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో వర్షం పడింది. భారీ కురిసిన వర్షం కారణంగా నాలాలు, మ్యాన్ హోల్స్ ఉప్పొంగుతున్నాయి. ఇక, లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి. పలు చోట్ల కాలనీలు నీట మునిగాయి.దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు చోట్ల విద్యుత్ అంతరాయం ఏర్పడంతో జంట నగరవాసుల బాధలు వర్ణణాతీతంగా మారాయి.
జీహెచ్ఎంసీ హెచ్చరిక
హైదరాబాద్లో ఇవాళ, రేపు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని జీహెచ్ఎంసీ ప్రకటించింది. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్లలోంచి బయటకు రావొద్దని, లేదంటే ఇంట్లోనే ఉండాలని విజ్ఞప్తి చేసింది. ఈ క్రమంలో విపత్తు నిర్వహణ బృందాలను జీహెచ్ఎంసీ అప్రమత్తం చేసింది. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా వాటిని ఎదుర్కొనేందుకు బృందాలను సిద్ధం చేసినట్లు పేర్కొంది.
దిశను మార్చుకున్న మోచా
మోచా తుపాను అనూహ్యంగా దిశను మార్చుకుంది. ఇప్పుడు బంగ్లాదేశ్, మయన్మార్ వైపు మళ్లీంది. ఇక్కడ గంటకు 148 కిలోమీటర్ల వేగంతో తీవ్రమైన తుపానుగా మారే అవకాశముందని భారత వాతావరణ కేంద్రం హెచ్చరించింది. దీంతో భారత్ కు మోచా తుఫాను ముప్పు తప్పిందని అధికారులు భావిస్తున్నారు. అయితే తూర్పు కోస్తా ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్టు వాతావరణ అధికారులు అంచనా వేస్తున్నారు.
