Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణ సీఎం కేసీఆర్‌తో సమావేశమైన కుమారస్వామి.. జాతీయ రాజకీయాలపై చర్చ..!

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో కర్ణాటక మాజీ సీఎం, జేడీఎస్ నేత కుమారస్వామి భేటీ అయ్యారు. హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో ఇరువురు నేతల సమావేశం జరుగుతుంది. 

HD Kumaraswamy Meets Telangana CM KCR At Pragathi Bhavan
Author
First Published Sep 11, 2022, 2:13 PM IST

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో కర్ణాటక మాజీ సీఎం, జేడీఎస్ నేత కుమారస్వామి భేటీ అయ్యారు. హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో ఇరువురు నేతల సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో జాతీయ రాజకీయాలు, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై ప్రధానంగా చర్చించనున్నారు. ఇక, కేసీఆర్‌తో సమావేశం కోసం కుమారస్వామి శనివారం రాత్రి హైదరాబాద్‌కు చేరుకున్నారు. రాత్రి హోటల్ గ్రాండ్ కాకతీయలో ఆయన బస చేశారు. ఈ రోజు ఉదయం హోటల్ గ్రాండ్ కాకతీయకు వెళ్లిన తెలంగాణ మంత్రి కేటీఆర్.. కుమారస్వామిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఇరువురు నేతలు కలిసి బ్రేక్ ఫాస్ట్ చేశారు. ఆ తర్వాత మధ్యాహ్నం ప్రగతిభవన్‌కు చేరుకున్న కుమారస్వామి.. సీఎం కేసీఆర్‌తో సమావేశమయ్యారు. 

జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా ప్రత్యామ్నాయ వేదిక కోసం ప్రయత్నాలు చేస్తున్న కేసీఆర్.. బీజేపీయేతర, కాంగ్రెసేతర పార్టీల ముఖ్య నేతలతో వరుసగా భేటీలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కేసీఆర్ ఆహ్వానం మేరకు కుమారస్వామి హైదరాబాద్‌కు చేరుకున్నారు. కేసీఆర్ దసరా లోపు జాతీయ స్థాయిలో పార్టీని ప్రారంభించే అవకాశం ఉన్నందున.. జాతీయ స్థాయిలో వేదికకు సంబంధించిన అంశాలపై ఇరువురు నేతలు చర్చలు జరిపే అవకాశం ఉంది. 

ఇక, ఈ ఏడాది చివరిలో కర్ణాటకలో అసెంబ్లీ జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కుమారస్వామి హైదరాబాద్‌కు వచ్చి కేసీఆర్‌తో భేటీ కానుండటం.. ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక, గతంలో కేసీఆర్ పలు సందర్భాల్లో బెంగళూరు వెళ్లి.. మాజీ ప్రధాని దేవెగౌడ, కుమారస్వామిలతో చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. 

ఇక, కేంద్రంలోని బీజేపీని గద్దె దించడానికి ప్రత్యామ్నాయ వేదిక కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కేసీఆర్ చెబుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లనున్నానని.. ఇందుకు తెలంగాణ ప్రజల ఆశీర్వాదం కావాలని కోరుతున్న సంగతి తెలిసిందే. కొద్ది రోజులుగా బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వాన్ని గద్దె దించే ప్రయత్నంలో జాతీయ స్థాయిలో కీలక పాత్ర పోషించాలని కేసీఆర్‌ను టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కోరుతున్నారు. సోమ, మంగళవారాల్లో జరిగే తెలంగాణ అసెంబ్లీ సమావేశాలను కూడా టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు.. జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టాలని కేసీఆర్‌ను అభ్యర్థించేందుకు ఉపయోగించుకునే అవకాశం ఉంది.

Follow Us:
Download App:
  • android
  • ios