టిఆర్ఎస్ లో హరీష్ వర్గానికి దక్కిన పోస్ట్

టిఆర్ఎస్ లో హరీష్ వర్గానికి దక్కిన పోస్ట్

ఆయన టిఆర్ఎస్ పార్టీ పుట్టినప్పటి నుంచి సైనికుడి మాదిరిగా పనిచేసిన కార్యకర్త. పార్టీ ఇబ్బందుల్లో ఉన్నా.. వెన్నంటి ఉన్న కమిటెడ్ పర్సన్. తెలంగాణ రాష్ట్ర సమితి విద్యార్థి విభాగానికి తొలి అధ్యక్షుడు కూడా ఆయనే. అయినా తెలంగాణ వచ్చిన తర్వాత ఆయనకు ఇప్పటి వరకు ఎలాంటి పదవి దక్కలేదు. కానీ ఇప్పుడు కీలక పదవి వరించింది. ఆయనెవరు? ఆయనకు ఏం పోస్టు ఇచ్చారో వివరాల కోసం ఈ స్టోరీ చదవండి.

ఎర్రోళ్ల శ్రీనివాస్ పేరు వినగానే టిఆర్ఎస్ పుట్టిన నాళ్లలో యూత్ లీడర్ గా చెలామణి అయిన వ్యక్తి. టిఆర్ఎస్ పార్టీ రోజు రోజుకూ ఇంతింతై వటుడింతై అన్నట్లు పెరిగిన నేపథ్యంలో ఎర్రోళ్ల శ్రీనివాస్ పెరుగుదల మాత్రం ఆగిపోయింది. ఆయన టిఆర్ఎస్ విద్యార్థి విభాగం ఏర్పాటైన తర్వాత తొలి అధ్యక్షుడిగా సుదీర్ఘ కాలం పనిచేశారు. ఆయన తర్వాత బాల్క సుమన్ పనిచేశారు. ఇప్పుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ టిఆర్ఎస్ విద్యార్థి విభాగం అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.

ఎర్రోళ్ల శ్రీనివాస్ యూటి బ్యాచ్ (ఉద్యమ బ్యాచ్) గా ఉన్నప్పటికీ ఆయనకు మాత్రం పదవులు రాలేదన్న అసంతృప్తి పార్టీ నేతల్లో ఉంది. బంగారు తెలంగాణ పేరుతో పార్టీలో కొందరు నేతలు ఇలా చేరి అలా పదవుల్లో ఒదిగిపోయారన్న విమర్శ ఉంది. కానీ తెలంగాణ కోసం, పార్టీ కోసం ముందనుంచి పనిచేసినా.. తమకు అవకాశాలు రావడంలేదన్న ఆరోపణలున్నాయి. ఈ వాదనలకు ఎర్రోళ్ల శ్రీనివాస్ ఎపిసోడ్ ప్రత్యక్ష ఉదాహరణగా చెబుతున్నారు.

ఎర్రోళ్ల శ్రీనివాస్ ఉమ్మడి మెదక్ జిల్లా వాసి. మంత్రి హరీష్ రావుకు అత్యంత ఆప్తుడు. హరీష్ రావు మాటే శాసనం అన్నంతగా పార్టీలో పనిచేస్తున్నారు ఎర్రోళ్ల శ్రీనివాస్. ఈ నేపథ్యంలో తెలంగాణ వచ్చి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మూడున్నరేళ్లు అయినా ఫౌండర్ ఉద్యమ నేతగా ఉన్న ఎర్రోళ్లకు ఇంతకాలం పదవి దక్కకపోవడం పట్ల రకరకాల చర్చలు సాగాయి. హరీష్ మనిషి కాబట్టే ఎర్రోళ్ళకు పదవి రాలేదా అన్న చర్చ జోరుగానే సాగింది. గతంలో రాజ్యసభకు ఎర్రోళ్ల పేరు పరిశీలన అని.. ఎమ్మెల్సీ పోస్టుకు ఎర్రోళ్ల పేరు పరిశీలన అని రకరకాల వార్తలు వెలువడ్డా.. అంతిమంగా ఆయన పేరు తుది జాబితాలో లేకుండాపోయింది. దీంతో ఒక దశలో ఎర్రోళ్ల శ్రీనివాస్ తీవ్రమైన అసంతృప్తిగా ఉన్నరోజులున్నాయి.

కానీ ఎట్టకేలకు మూడున్నరేళ్ల తర్వాత ఎర్రోళ్లకు ఎస్సీ కమిషన్ ఛైర్మన్ గా నియమిస్తున్నట్లు సిఎం కేసిఆర్ ప్రకటించారు. దీంతో పార్టీలో ఉద్యమ నేతలకు కూడా  అవకాశాలు దక్కుతాయని మరోసారి సంకేతాలు ఇచ్చినట్లైందని పార్టీలో చర్చ జరుగుతోంది. అయితే ఎర్రోళ్ల లాంటి వాళ్లు ఇంకా చాలా మంది పార్టీకి పిల్లర్స్ గా పనిచేశారని, వారందరినీ గుర్తించి గౌరవించాలని పలువురు కోరుతున్నారు. పదవులు రాబట్టుకోవడంలో బిటి బ్యాచ్ ఉన్నంత స్పీడ్ గా యూటి బ్యాచ్ లేదన్న చర్చ ఇంకా కొనసాగుతూనే ఉంది.  

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos