తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మేనల్లుడు, మాజీ ఆర్థిక మంత్రి హరీష్ రావు అనారోగ్యంతో హాస్పిటల్లో చేరారు. ఆయన అనారోగ్యానికి కారణమేంటో తెలుసా?
Harish Rao : మాజీ మంత్రి, బిఆర్ఎస్ సీనియర్ నాయకులు హరీష్ రావు అస్వస్థతకు గురయ్యారు. ఇవాళ(సోమవారం) బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు(కేటీఆర్) ను ఫార్ములా ఈ రేసింగ్ కేసులో ఏసిబి విచారించింది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు చాలా ఆసక్తికరంగా మారాయి. ఈ నేపథ్యంలోనే ఉదయం నుండి సాయంత్రం వరకు బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలోనే ఉన్నారు హరీష్ రావు.. అక్కడే ఆయన స్వల్ప అనారోగ్యానికి గురవగా వెంటనే హాస్పిటల్ కు తరలించారు.
ముందునుండే కాస్త నలతగా ఉన్నా కేటీఆర్ ఏసిబి విచారణ నేపథ్యంలో హరీష్ రావు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనాల్సి వచ్చింది. ఉదయం పార్టీ కార్యాలయంలో ఉంటూ ఎప్పటికప్పుడు పరిస్థితిని తెలుసుకుంటూ బిజిబిజీగా గడిపారు. కేటీఆర్ కు మద్దతుగా తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ ఉన్నారు. ఇలా రోజంతా తీరికలేకుండా ఉండటంతో హరీష్ రావు అస్వస్థతకు గురయినట్లు... వైరల్ ఫీవర్ బారిన పడినట్లు తెలుస్తోంది.
కేటీఆర్ ఏసిబి విచారణ అనంతరం తెలంగాణ భవన్ కు చేరుకున్న సమయంలోనూ హరీష్ రావు ఆయనను ఆలింగనం చేసుకుని స్వాగతం పలికారు. అనంతరం మిగతా నాయకులతో కేటీఆర్ మీడియా సమావేశానికి హాజరయ్యారు. ఈ సమయంలో హరీష్ రావు అలసట పెరిగి నిలబడలేకపోయారు... కేటీఆర్ మాట్లాడుతుండగానే వెళ్లిపోయారు. ఆయన పరిస్థితిని గమనించి వెంటనే బేగంపేట కిమ్స్ హాస్పిటల్ కు తరలించారు. ఆయనకు ప్రస్తుతం వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
ప్రస్తుతం హరీష్ రావు ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని... హైఫీవర్ తో బాధపడుతున్నట్లుగా తెలుస్తోంది. వైద్యులు మెడికల్ టెస్టులు నిర్వహిస్తున్నారు... రిపోర్టులు వచ్చాక హరీష్ అనారోగ్య సమస్యేమిటో స్పష్టంగా తెలియనుంది. హరీష్ రావు ఆరోగ్యం పట్ల బిఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
