ఎపి ప్రత్యేక హోదాకు తెలంగాణ కొర్రి ఇదీ..

First Published 25, Jul 2018, 8:23 AM IST
Harish Rao demnads SCS to Telangana
Highlights

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రత్యేక హోదాకు తెలంగాణ కూడా మోకాలడ్డుతోంది. బీహార్ వంటి కొన్ని రాష్ట్రాలు ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తుండగా, ఆ జాబితాలో తెలంగాణ కూడా ఉంది. 

సంగారెడ్డి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రత్యేక హోదాకు తెలంగాణ కూడా మోకాలడ్డుతోంది. బీహార్ వంటి కొన్ని రాష్ట్రాలు ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తుండగా, ఆ జాబితాలో తెలంగాణ కూడా ఉంది. తెలంగాణ మంత్రి టి. హరీష్ రావు మంగళవారం తెలంగాణకు కూడా ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. 

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తే.. తెలంగాణకూ ఇవ్వాలని ఆయన అన్నారు.ఏపీకి హోదా ఇస్తే తెలంగాణలోని పరిశ్రమలు అక్కడికి తరలివెళ్తాయని, దీంతో స్థానికులు రోడ్డు మీద పడతారని అన్నారు. సంగారెడ్డి జిల్లా మల్కాపూర్‌ వద్ద 65వ నంబర్‌ జాతీయ రహదారిపై రూ.26 కోట్లతో నిర్మించ తలపెట్టిన అండర్‌పాస్‌కు మంగళవారం ఆయన శంకుస్థాపన చేశారు.

ఏపీకి హోదా కల్పిస్తామ ని సీడబ్ల్యూసీ కమిటీ సమావేశంలో తీర్మానించడంపై ఇక్కడి కాంగ్రెస్‌ నేతలు సమాధానం చెప్పాలని ఆయన అన్నారు. పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన సంగారెడ్డి, పటాన్‌చెరు ప్రాంతాల నుంచి ఏపీకి పరిశ్రమలు తరలివెళ్తే మనమేం చేయాలని ఆయన అడిగారు. 

ఏపీలోని పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చిన కేంద్రం తెలంగాణలో ఒక్క సాగునీటి ప్రాజెక్టుకూ ఇవ్వలేదని విమర్శించారు.

కాళేశ్వరం ప్రాజెక్టు పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి సింగూరు ప్రాజెక్టును నింపుతామని హరీశ్‌రావు ప్రకటించారు. హస్తం అంటేనే ఉత్త చేతులు.. కాంగ్రెస్‌ హయాంలో ప్రజలకు మేలు జరగలేదని విమర్శించారు. కాంగ్రెస్‌ పాలనలో కేవలం నాయకులు, కార్యకర్తలకే మేలు జరిగిందని అన్నారు. 

loader