telangana elections 2023 : నేనేం తప్పు మాట్లాడలేదు.. నా వల్ల రైతుబంధు ఆగలేదు.. : హరీష్ రావు
నేను మాట్లాడడం వల్లే రైతుబంధు ఆగిందనడం సరికాదన్నారు మంత్రి హరీష్ రావు. తానేం తప్పు మాట్లాడలేదన్నారు.
జహీరాబాద్ : రైతుబంధు ఆగిపోవడం మీద మంత్రి హరీష్ రావు కాంగ్రెస్పై మండిపడ్డారు. కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేయడంతోనే ఈసీ రైతుబంధుకు అనుమతి నిరాకరించిందన్నారు. రైతు బంధును ఎన్ని రోజులు ఆపుతారని ప్రశ్నించారు. డిసెంబర్ 3 వరకు ఆపగలరని ఆ తర్వాత మళ్లీ వచ్చేది, ఇచ్చేది కేసీఆరేనని చెప్పుకొచ్చారు. మంత్రి హరీష్ రావు జహీరాబాద్ లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో ఈ మేరకు ప్రసంగించారు. కాంగ్రెస్ నేత నిరంజన్ రెడ్డి ఎన్నికల కమిషన్ కు రైతుబంధుపై ఫిర్యాదు చేశారని మండిపడ్డారు.
కాంగ్రెస్ వాళ్లు రైతులకు ఇవ్వరని.. ఇచ్చిన వాళ్లను అడ్డుకునేటమే వారి పని అని చెప్పుకొచ్చారు. తెలంగాణ రైతులతో కేసీఆర్ ది పేగుబందమని ఓటు బంధం కాదని అన్నారు. గతంలో ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పకపోయినా రైతుబంధు ఇచ్చామని గుర్తు చేశారు. ఇప్పటివరకు ఈ పదేళ్లలో కెసిఆర్ ప్రభుత్వం రైతులపై ప్రేమతో 11 సార్లు రైతుబంధును ఇచ్చిందని ఓట్ల కోసం కాదని తెలిపారు.
ఫాం హౌస్ సీఎం మనకు అవసరమా..అంటూ తెలుగులో స్పీచ్ అదరగొట్టిన ప్రధాని...
రైతుబంధు కింద ఎకరాకు సంవత్సరానికి రూ. 16,000 కేసీఆర్ ఇస్తానంటే.. రైతుకు ఏడాదికి రూ. 15000 ఇస్తామని కాంగ్రెస్ చెబుతోందని ఈ కుట్రలను తిప్పి కొట్టాలన్నారు. కాంగ్రెస్ నేతలకు ఓటుతోనే ఓటు పొడవాలని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతుబంధు నిలిచిపోతుందని అన్నారు.
రైతుబంధు మీద ఎన్నికల ప్రచార సభలో హరీష్ రావు చేసిన వ్యాఖ్యలతోనే ఈసీకి ఫిర్యాదులు వెళ్లాయని సమాచారం రావడంతో దీని మీద హరీష్ రావు స్పందిస్తూ.. ఈసీ అనుమతి ఇచ్చిందని చెప్పానని అన్నారు. దీంట్లో తప్పేముందని ప్రశ్నించారు. ఓ సభలో హరీష్ రావు మాట్లాడుతూ.. సోమవారం ఉదయం మీరు టీ తాగే సమయానికి మీ ఫోన్లో రైతుబంధు నిధులు పడిన సమాచారం మోగుతుందని అన్నారు. ఆయన ఈ వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకున్న ఎలక్షన్ కమిషన్ రైతుబంధును నిరాకరించింది.
దీనిమీద హరీష్ రావు మాట్లాడుతూ తాను మాట్లాడిన దాంట్లో తప్పేముందని ప్రశ్నించారు. రైతుల నోటికాడి ముద్దను కాంగ్రెస్ అడ్డుకుంటుందన్నారు. తాను తప్పేం మాట్లాడలేదని.. ఎలాంటి నిబంధనలు ఉల్లంఘించలేదన్నారు.