హైదరాబాద్: ప్రేమించి పెళ్లి చేసుకొన్న యువతిని హత్య చేసి ఇద్దరు పిల్లలను విక్రయించిన హనుమంతును  పోలీసులు అరెస్ట్ చేశారు.  తన సోదరి ఆచూకీ కోసం  ఉపేంద్ర అనే వ్యక్తి సుమారు 9 ఏళ్లుగా  వెతుకుతున్నాడు. ఎట్టకేలకు తన సోదరి ఆచూకీ లభ్యమైంది. అయితే అప్పటికే బావే ఆమెను హత్య చేశాడని ఉపేంద్ర గుర్తించి షాక్‌కు గురయ్యాడు. ఉపేంద్ర ఫిర్యాదు మేరకు పోలీసులు  అతడిని అరెస్ట్ చేశారు.

నల్గొండ జిల్లాలోని మర్రిగూడ మండలానికి చెందిన లింగమ్మను, అదే ప్రాంతానికి చెందిన హనుమంతు ప్రేమించి పెళ్లి చేసుకొన్నాడు. 12 ఏళ్ల క్రితం వీరిద్దరూ తమ గ్రామం నుండి పారిపోయి వివాహం చేసుకొన్నారు. వీరికి ఓ పాప, బాబు ఉన్నారు. హైద్రాబాద్ దిల్‌సుఖ్ నగర్, ఎల్బీనర్ ప్రాంతాల్లో నివాసం ఉండేవారు. అయితే వీరిద్దరి మధ్య  ఏం జరిగిందో తెలియదు కానీ, లింగమ్మను  భర్త హనుమంతు హత్యచేశాడు. వీరికి పుట్టిన ఇద్దరు పిల్లలను కూడ విక్రయించాడు.

అయితే లింగమ్మ కోసం ఆమె సోదరుడు సుమారు 9 ఏళ్ల నుండి గాలింపు చర్యలు చేపట్టాడు.అయితే కొద్దిరోజుల క్రితం హైద్రాబాద్‌లో హనుమంతు ఆచూకీ లభ్యమైంది. లింగమ్మ కోసం ఉపేంద్ర ఆరా తీశాడు. అయితే హనుమంతు మాత్రం లింగమ్మ గురించి మాత్రం ఎలాంటి సమాచారాన్ని ఇవ్వలేదు.

దీంతో  లింగమ్మ గురించి ఎల్బీనగర్ పోలీసులను ఉపేంద్ర ఆశ్రయించాడు. అయితే ఈ విషయమై మర్రిగూడ పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. మర్రిగూడ పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని విచారణ జరిపించారు.ఈ విచారణలో హన్మంతు  తన భార్య లింగమ్మను హత్య చేసి మర్రిగూడకు సమీమపంలోని ఓ బావిలో పడేశాడని గుర్తించారు.


బావిలో మృతదేహం కోసం  గాలింపు చర్యలు చేపట్టారు.  అయితే హనుమంతు  ఇటీవల మరో వివాహం చేసుకొని జీవనం సాగిస్తున్నారు.