తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన హాజీపూర్ వరస హత్యల కేసులో మంగళవారంతో ప్రాసిక్యూషన్ వాదనలు ముగిశాయి. డిఫెన్స్ తరపున వాదనలను కోర్టు బుధవారానికి వాయిదా వేసింది. కాగా.. ఇవాళ జరిగిన వాదనల సందర్భంగా నిందితుడు శ్రీనివాస్ రెడ్డికి ఉరిశిక్ష విధించాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టును కోరారు.

Also Read:జాలి, దయ అక్కర్లేదు...హాజీపూర్ శ్రీనివాస్‌‌‌కి ఉరే సరి

నిందితుడు ఇచ్చిన సమాచారం మేరకే కల్పన మృతదేహానికి సంబంధించిన ఆనవాళ్లను వెలికి తీశారని.. ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం ఖచ్చితమైన సమాచారం ఇచ్చిన వారిని నిందితుడిగా అనుమానించవచ్చని, నిందితుడు శ్రీనివాస్ రెడ్డి అన్ని విధాలా ఉరిశిక్షకు అర్హుడని పీపీ న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు.

కాగా యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్‌లో శ్రావణి, కల్పన, మనీషా అనే మైనర్ బాలికలను శ్రీనివాస్ రెడ్డి అత్యాచారం చేసి, దారుణంగా హత్య చేశాడు.

Also Read:నాపై తప్పుడు కేసు పెట్టారు: హాజీపూర్ నిందితుడు శ్రీనివాస్ రెడ్డి

అనంతరం వారి మృతదేహాలను ఊరి చివర ఉన్న బావిలో పూడ్చి పెట్టినట్లు పోలీసులు దర్యాప్తులో తేలింది. అంతేకాకుండా మరో మహిళ హత్య కేసులోనూ నిందితుడికి సంబంధం ఉంది. దీనిపై ప్రభుత్వం నల్గొండలో ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసి వేగంగా విచారణ నిర్వహిస్తోంది. అతి త్వరలోనే ఈ కేసులో తుది తీర్పు వస్తుందని తెలుస్తోంది.