తెలంగాణలో నాలుగు రోజుల్లోనే ఎన్నికలు: జీవిఎల్

First Published 30, Jun 2018, 8:46 PM IST
GVL comments on the election mood
Highlights

తెలంగాణలో వాతావరణం చూస్తే నాలుగు రోజుల్లోనే ఎన్నికలు వస్తాయన్నట్లుందని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌ నర్సింహారావు వ్యాఖ్యానించారు.

మెదక్: తెలంగాణలో వాతావరణం చూస్తే నాలుగు రోజుల్లోనే ఎన్నికలు వస్తాయన్నట్లుందని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌ నర్సింహారావు వ్యాఖ్యానించారు. బీజేపీ చేపట్టిన జన చైతన్య యాత్రలో భాగంగా మెదక్‌ జిల్లా దుబ్బాకలో జరిగిన బహిరంగ సభలో ఆయన శనివారం ప్రసంగించారు. 

విప్లవం కోసం ఎదురుచూసినట్టుగా సభకు వచ్చిన ప్రజలు టీఆర్‌ఎస్‌ను గద్దెదించాలని చూస్తున్నారని ఆయన అన్నారు. తెలంగాణలో జరుగుతున్న జన చైతన్య యాత్రకు ఢిల్లీ స్థాయిలో చర్చ జరుగుతోందని అన్నారు. 

రెండు తెలుగు రాష్ట్రాల్లో చంద్రగ్రహణం పట్టుకుందని, 2019లో జరిగే ఎన్నికల్లో ఆ చంద్రగ్రహణం వీడుతుందని అన్నారు. కుటుంబ పాలన సాగిస్తున్న ఇ‍ద్దరు ముఖ్యమంత్రులు కూడా అభివృద్ధి గాలికి వదిలేసి కొడుకులను ముఖ్యమంత్రులను చేయాలని ఆలోచిస్తున్నారని విమర్శించారు. 

కేంద్ర ప్రభుత్వం 20 వేల కోట్లు ఇస్తే ఇంకా అప్పులు ఎందుకు తెస్తున్నారని అడిగారు. ఇటీవల విడుదల చేసిన ఓ సర్వే ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాలు అవినీతిలో మొదటి స్థానంలో ఉన్నాయని అన్నారు. రాష్ట్రంలో నాలుగు వేలమంది  రైతులు ఆత్మహత్యలు చేసుకున్నా సీఎం కేసీఆర్‌ పట్టించుకోవడం లేదని అన్నారు.