నల్లగొండ: శ్రీశైలం రిజర్వాయర్ నుంచి 88 టీఎంసీల జలాలను రాయలసీమకు తరలించుకుని వెళ్లాలనుకోవడం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అత్యాశే అవుతుందని తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన 203 జీవోపై ఆయన శనివారం స్పందించారు. 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 30 టీఎంసీల నీటిని దొంగచాటుకుగా తరలించుకుని వెళ్లిందని అధికారులు చెబుతున్నారని ఆయన అన్నారు. తెలంగాణ ఉద్యమమే నీళ్లు, నిధులు, నియామకాల కోసం జరిగిందని, వైఎస్ జగన్ తో ఎటువంటి సంబంధాలున్నా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నీళ్ల విషయంలో లాలూచీ పడబోరని ఆయన అన్నారు.

Also Read: జగన్ తో కేసీఆర్ సీక్రెట్ ఒప్పందం: పోతిరెడ్డిపాడుపై బండి సంజయ్ 

పోతిరెడ్డిపాడుకు వ్యతిరేకంగా రాజకీయ పక్షాలన్నీ ఏకం కావాలని, రైతు సమస్యలపై రాజకీయం చేయడం తగదని ఆయన అన్నారు. పోతిరెడ్డిపాడుకు వ్యతిరేకంగా రెండు గంటలు దీక్ష చేసి ప్రతిపక్షాలు ఉద్యమాలను అవమానిస్తున్నాయని ఆయన అన్నారు. 

పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని పెంచుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం జారీ చేసిన 203 జీవోపై తెలంగాణ ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా దీక్షలు కూడా చేపట్టాయి. ఈ నేపథ్యంలో గుత్తా సుఖేందర్ రెడ్డి స్పందించారు.