మోదీ ఆశీర్వాదం లేకుండానే... కేటీఆర్ ముఖ్యమంత్రి కావడం ఖాయం : గుత్తా సంచలనం
ప్రధాని నరేంద్ర మోదీ నిజామాబాద్ సభలో బిఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ కుటుంబంపై చేసిన వ్యాఖ్యలప మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఘాటుగా స్పందించారు.

మిర్యాలగూడ : ఎన్డీఏలో చేరేందుకు, కొడుకును ముఖ్యమంత్రి చేసేందుకు కేసీఆర్ తనతో సంప్రదింపులు జరిపినట్లు స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నారు. నిజామాబాద్ సభలో ప్రధాని చేసిన కామెంట్స్ పై బిఆర్ఎస్ నేతలు భగ్గుమంటున్నారు. ఇలా తెలంగాణ శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా ప్రధాని మోదీ వ్యాఖ్యలపై స్పందించారు.
నిజామాబాద్ సభలో మోదీ చేసిన ప్రసంగం ప్రధానమంత్రి స్థాయిని దిగజార్చే విధంగా ఉందని గుత్తా అన్నారు. అత్యున్నతమైన దేశ ప్రధాని హోదాలోని ఉండి ఓ రాష్ట్ర ముఖ్యమంత్రిపైనా, ఆయన కుటుంబసభ్యులపైనా అసత్యపు ఆరోపణలు చేయడం సిగ్గుచేటని అన్నారు. వెంటిలేటర్ పై వున్న బిజెపిని బ్రతికించుకునేందుకే ప్రధాని రాజకీయాలు చేస్తున్నారని... అందులో భాగంగానే కేసీఆర్ కుటుంబంతో ఆరోపణలు చేసారని గుత్తా అన్నారు.
ఉన్నత చదువులు చదివి గొప్ప విజన్ తో కేటీఆర్ రాజకీయాల్లోకి వచ్చారని గుత్తా అన్నారు. తన నాయకత్వంతో, పాలనా నిర్ణయాలతో కేటీఆర్ ప్రజాభిమానాన్ని సంపాదించుకున్నాడని... తప్పకుండా భవిష్యత్ లో కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతారన్నారు. కేసీఆర్ ఎప్పుడు అనుకుంటే అప్పుడు కేటీఆర్ సీఎం అవుతారు... అందుకు ఎవరి ఆశీర్వాదమో అవసరం లేదని గుత్తా అన్నారు.
Read More సినిమాలకు స్క్రిప్ట్ లు రాసుకొండి.. మోడీ లాంటి మోసగాడితో కేసీఆర్ సహవాసం చేయరు : కేటీఆర్
ఇక వారసత్వ రాజకీయాల గురించి బిజెపి నేతలు మాట్లాడటం దారుణమని... దీనికి అంకురార్ఫణ చేసిందే మీ పార్టీ అని గుర్తుంచుకోవాలని గుత్తా అన్నారు. కేసీఆర్, ఆయన కుటుంబం గురించి మాట్లాడే అర్హత మోదీకి అస్సలు లేదన్నారు. ప్రాణాలను పణంగా పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన గొప్ప నాయకుడు కేసీఆర్ అని గుత్తా కొనియాడారు.
అవినీతిపరులు తన పక్కన కూర్చోడానికి బయపడతారని ప్రధాని మోదీ అనడం హాస్యాస్పందంగా వుందని గుత్తా అన్నారు. ఈడీ, సిబిఐ ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని బిజెపిలో చేర్చుకుంటున్న విషయాన్ని మోదీ మరిచారేమో... ప్రజలు మాత్రం గమనిస్తూనే వున్నారన్నారు. మేము అవినీతి చేయలేదు కాబట్టి ఈడి, సిబిఐలకు భయపడటం లేదన్నారు. కేవలం రాజకీయ లబ్ది కోసమే కేసీఆర్ పై తప్పుడు ఆరోపణలు చేయడం సబబు కాదని గుత్తా అన్నారు.
గత తొమ్మిదేళ్లలో తెలంగాణకు ఒక్క పైసా కూడా మోదీ ప్రభుత్వం ఇవ్వలేదని... విభజన హామీలను తుంగలో తొక్కిన ఘనుడు మోదీ అని మండిపడ్డారు. పార్లమెంట్ లోపల ,పార్లమెంట్ బయట తెలంగాణ రాష్ట్రాన్ని అవహేళన చేస్తూ పలుమార్లు ప్రధాని ప్రసంగించారని అన్నారు. ఇలా తెలంగాణపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్న మోదీకి ఈ గడ్డపై మాట్లాడే అర్హత లేదన్నారు. ఇకనైనా ప్రధాని మోదీ నియంత ఆలోచనలు మానుకోవాలని మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సూచించారు.