గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాజ్‌భవన్‌ నిర్వహించిన వేడుకల్లో గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ చేసిన కామెంట్స్‌సై తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పరోక్షంగా స్పందించారు. 

గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాజ్‌భవన్‌ నిర్వహించిన వేడుకల్లో గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ చేసిన కామెంట్స్‌సై తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి స్పందించారు. తెలంగాణలో ప్రజాస్వామ్యం అమలవుతుందని అన్నారు. బాధ్యతల్లో ఉన్నవాళ్లే తెలంగాణ అభివృద్దిని గుర్తించకపోవడం బాధకరమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించేవాల్లు.. తెలంగాణకు కేంద్రం ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్రం ఏం చేసిందని అడిగితే.. జాతీయ రహదారుల గురించి మాత్రమే మాట్లాడుతున్నారని విమర్శించారు. వ్యవసాయ క్షేత్రాలను, కొత్త భవనాలను విమర్శించడం తగదని అన్నారు. కొందరికి తెలంగాణ అభివృద్ది కనిపించకపోతే చేసేది ఏమి లేదని అన్నారు. 

ఇక, తెలంగాణ శాసనమండలిలో గణతంత్ర దినోత్సవం ఘనంగా నిర్వహించారు. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి జాతీయ పతాకవిష్కరణ చేశారు. అసెంబ్లీ ఆవరణలో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. 

Also Read: రాజ్‌భవన్‌‌లో రిపబ్లిక్ డే వేడుకులకు సీఎం కేసీఆర్ దూరం... ప్రభుత్వంపై పరోక్ష విమర్శలు చేసిన గవర్నర్ తమిళిసై..

ఇదిలా ఉంటే.. 74వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ రాజ్‌భవన్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ప్రసంగించిన గవర్నర్ తమిళిసై పరోక్షంగా తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. రాజ్యాంగం ప్రకారమే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ అన్నారు. తెలంగాణకు ఘనమైన, విశిష్టమైన చరిత్ర ఉందన్నారు. కొత్త భవనాలు నిర్మించటం మాత్రమే అభివృద్ది కాదు.. నేషనల్ బిల్డింగ్ అనేది అభివృద్ది అన్నారు. కొందరికి ఫామ్‌హౌస్‌లు కాదు.. అందరికి ఫామ్‌లు కావాలని అన్నారు. రైతులు, పేదలు అందరికీ భూములు, ఇళ్లు కావాలని చెప్పారు. మన పిల్లలు విదేశాల్లో చదవడం కాదు.. రాష్ట్ర విద్యాలయాల్లో అంతర్జాతీయ సౌకర్యాలు ఉండాలని అన్నారు. తెలంగాణలో పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి. రాష్ట్రంలో రోజుకు 22 మంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. తెలంగాణ ప్రజలు ఆత్మ స్థైర్యంతో ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నానని చెప్పారు. 

‘‘తెలంగాణ గౌరవాన్ని నిలబెడుదాం. తెలంగాణ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం. తెలంగాణ హక్కులను నిబెట్టుకుందాం. తెలంగాణతో నాకున్న అనుబంధం మూడేళ్ల నుంచి కాదు.. ఇది పుట్టుకతో జీవి నుంచే వచ్చింది. తెలంగాణ అభ్యున్నతితో నా పాత్ర తప్పకుండా ఉంటుంది. నా పెద్ద బలం హార్డ్ వర్క్, నిజాయితీ, ప్రేమ. కొంతమందికి నేను నచ్చకపోవచ్చు. కానీ నాకు తెలంగాణ వాళ్లంటే ఇష్టం. అందుకే ఎంత కష్టమైనా పనిచేస్తాను’’ అని గవర్నర్ తమిళిసై తెలుగులో ప్రసంగించారు.