సోలార్ ప్యానల్ మెటీరియల్ సప్లై చేస్తానని నమ్మించి మోసం చేసిన ఓ వ్యక్తిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిని గుజరాత్‌కు చెందిన ఐలేష్ షాగా గుర్తించారు.

సోలార్ ప్యానల్ మెటీరియల్ సప్లై చేస్తానని నమ్మించి మోసం చేసిన ఓ వ్యక్తిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిని గుజరాత్‌కు చెందిన ఐలేష్ షాగా గుర్తించారు. వివరాలు.. ఐలేష్ గుజరాత్‌లోని సూరత్‌లో సోలార్ ప్యానల్ కంపెనీ నడుపుతున్నాడు. అయితే హైదరాబాద్‌కు చెందిన ఓ కంపెనీకి 5,580 సోలార్ మాడ్యుల్స్ సరఫరా చేస్తానని ఐలేష్ నమ్మించాడు. ఐలేష్ సోలార్ కంపెనీ నడుపుతుండటంతో నమ్మకంతో సోలార్ మాడ్యుల్స్ కోసం.. ఆ కంపెనీ రూ. 8.7 కోట్లను అతని బదిలీ చేసింది. అయితే ఈ డబ్బును ఐలేష్ తన బినామీ ఖాతాల్లోకి ట్రాన్స్‌ఫర్ చేశాడు. 

అయితే ఐలేష్ చెప్పినట్టుగా సోలార్ మాడ్యుల్స్ సరఫరా చేయకపోవడంతో బాధితులు హైదరాబాద్ సీసీఎస్ పోలీసులను ఆశ్రయించారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ఈ క్రమంలోనే పోలీసులు నిందితుడు ఐలేష్‌ను ముంబైలో అరెస్ట్ చేశారు. అనంతరం ఐలేష్‌ను హైదరాబాద్‌కు తీసుకొచ్చి రిమాండ్‌కు తరలించారు. అతని వద్ద నుంచి రూ. 38 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. అతని బినామీ ఖాతాలను పోలీసులు సీజ్ చేయించారు.