తెలంగాణలో మరోసారి ఉగ్రలింకుల కలకలం.. గుజరాత్ ఏటీఎస్ అదుపులో తండ్రీకూతుళ్లు, మెడికల్ షాప్ ఓనర్!!
తెలంగాణలో మరోసారి ఉగ్రలింకులు కలకలం రేపాయి. గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్(ఏటీఎస్) బృందాలు తెలంగాణలోని హైదరాబాద్, పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో తనిఖీలు చేపట్టి మొత్తం ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.
తెలంగాణలో మరోసారి ఉగ్రలింకులు కలకలం రేపాయి. గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్(ఏటీఎస్) బృందాలు తెలంగాణలోని హైదరాబాద్, పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో తనిఖీలు చేపట్టి మొత్తం ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వీరికి ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఖొరాసన్ ఫ్రావిన్స్‌తో లింక్‌లు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక, సోమవారం రాత్రి నుంచి చేపట్టిన ఈ తనిఖీలు మంగళవారం వరకు కొనసాగాయి. వివరాలు.. గుజరాత్ ఏటీఎస్ పోలీసులు ఐఎస్‌కేపీ మాడ్యూల్‌కు వ్యతిరేకంగా పోర్‌బందర్, సూరత్, శ్రీనగర్‌లలో ఆపరేషన్ ప్రారంభించింది. ఐఎస్‌కేపీతో సంబంధాలు కలిగి ఉన్న సమీరా బానో సహా శ్రీనగర్‌కు చెందిన నలుగురు వ్యక్తులను అరెస్టు చేసింది. వీరు పాకిస్థాన్‌కు చెందిన హ్యాండ్లర్‌లతో సంప్రదింపులు జరుపుతున్నట్లు ఆరోపణలు వచ్చాయి.
ఏటీఎస్‌కు చిక్కిన సుమేరా బాను ఆన్‌లైన్ ద్వారా ఐఎస్‌కేపీపై ప్రభావితమైంది. సోషల్ మీడియా ద్వారా అందులో శిక్షణ తీసుకుంది. అంతే కాకుండా మరికొందరని ఇందులో చేర్పించేలా సమీరా బాను ప్రయత్నాలు చేసిందనే ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలోనే విచారణ చేపట్టిన గుజరాత్ ఏటీఎస్.. తెలంగాణలో సుమేరా భానుతో కాంటాక్ట్ కలిగి ఉన్నవారిపై ఫోకస్ చేసింది.
ఈ క్రమంలోనే కాలాపతేర్‌లోని రంజన్ కాలనీలో నివాసం ఉంటున్న సయ్యద్ ఫసియుల్లా అనే వ్యక్తిని ఏటీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఫసియుల్లా నగరంలో ఓ మెడికల్ షాప్ నిర్వహిస్తున్నాడు. మూడు సంవత్సరాల క్రితం తమిళనాడుకు చెందిన ఒక వ్యక్తితో సమీరా వివాహాన్ని ఏర్పాటు చేయడంలో ఫసియుల్లా సహకరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలోనే అతడిని అదుపులోకి తీసుకున్న గుజరాత్ ఏటీఎస్ పోలీసులు.. పలు కోణాల్లో అతడిని ప్రశ్నిస్తున్నారు.
మరోవైపు పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో తనిఖీలు నిర్వహించిన ఏటీఎస్ పోలీసులు.. శ్రీనగర్ కాలనీలో ఉన్న ఓ వ్యక్తిని, అతని కూతురిని అదుపులోకి తీసుకున్నారు. ఆ వ్యక్తి సాఫ్ట్‌వేర్ ట్రైనర్‌గా పనిచేస్తున్నారు. వారిది స్వస్థలం గోదావరిఖని కాగా.. హైదరాబాద్ టోలిచౌకీ ప్రాంతంలో స్థిరపడ్డారు. అయితే బక్రీద్ సందర్బంగా వారు గోదావరిఖనిలోని బంధువుల దగ్గరకు వచ్చారు. ఈ విషయం తెలుసుకున్న గుజరాత్ ఏటీఎస్ అధికారులు.. మంగళవారం గోదావరిఖని నుంచి వారిని అదుపులోకి తీసుకుని హైదరాబాద్‌కు తరలించారు. అయితే ఏటీఎస్ బృందం వీరి వాంగ్మూలాలు తీసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇక, సాఫ్ట్‌వేర్ ట్రైనర్‌గా ఉన్న వ్యక్తి కూతురితో సమీరా చాటింగ్ చేసిందనే ఆరోపణలు ఉన్నాయి. అయితే అది ఏ విషయంలో అన్నది స్పష్టత లేదు.