గ్రూప్-2 పరీక్షలు వాయిదా వేయాలి: తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన అభ్యర్థులు
గ్రూప్-2 పరీక్షలను వాయిదా వేయాలని తెలంగాణ హైకోర్టులో గురువారంనాడు పిటిషన్ దాఖలైంది. గురుకుల సహా ఇతర పరీక్షలున్నందున ఈ పరీక్షలను వాయిదా వేయాలని పిటిషనర్లు కోరారు.
హైదరాబాద్: గ్రూప్-2 పరీక్షలను వాయిదా వేయాలని తెలంగాణ హైకోర్టులో గురువారంనాడు పిటిషన్ దాఖలైంది. 150 మంది అభ్యర్థులు ఈ పిటిషన్ దాఖలు చేశారు.గురుకుల పరీక్ష, జూనియర్ లెక్చరర్ పరీక్షలు ఉన్నందున గ్రూప్-2 పరీక్షలను వాయిదా వేయాలని ఆ పిటిషన్ లో కోరారు.అంతేకాదు బ్యాంకు ఉద్యోగాలతో పాటు ఇతర పోటీ పరీక్షలు కూడ ఉన్నాయని అభ్యర్థులు గుర్తు చేస్తున్నారు. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొని గ్రూప్-2 పరీక్షలను వాయిదా వేయాలని కోరుతున్నారు.
గ్రూప్-2 పరీక్షలను ఈ నెల 29, 30 తేదీల్లో నిర్వహించాలని టీఎస్‌పీఎస్‌సీ నిర్ణయం తీసుకుంది. అయితే ఇదే నెలలో ఇతర పోటీ పరీక్షలతో ఏ పరీక్షలకు ప్రిపేర్ కావాలనే దానిపై సందిగ్ధత నెలకొందని అభ్యర్థులు చెబుతున్నారు.గ్రూప్-2 పరీక్షలను వాయిదా వేయాలని వారం రోజుల క్రితం టీఎస్‌పీఎస్‌సీ చైర్మెన్ ను గ్రూప్-2 అభ్యర్థులు కోరారు. అయితే ఈ విషయమై టీఎస్‌పీఎస్‌సీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.దీంతో గ్రూప్-2 పరీక్షలను వాయిదా వేయాలని కోరుతూ 150 మంది అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
మరోవైపు ఈ పరీక్షలను వాయిదా వేయాలని కోరుతూ టీఎస్‌పీఎస్‌సీ కార్యాలయం వద్ద అభ్యర్థులు ఆందోళనకు దిగారు . ఇవాళ ఉదయం నుండి అభ్యర్థులు ఆందోళన నిర్వహిస్తున్నారు. తెలంగాణ జన సమితి చీఫ్ కోదండరామ్ , కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్, ఎన్‌ఎస్‌యూఐ నేత బల్మూరి వెంకట్ తదితరులు ఈ ఆందోళనకు తమ మద్దతు ప్రకటించారు. ఆందోళన చేస్తున్నవారిలో కొందరు కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టీఎస్‌పీఎస్‌సీ వద్ద ఆందోళన చేస్తున్నవారిలో ఆరుగురిని టీఎస్‌పీఎస్‌సీ అధికారులు చర్చలకు పిలిచారు. పరీక్షలు వాయిదా వేయాలని అభ్యర్థుల తరపు ప్రతినిధులు టీఎస్‌పీఎస్‌సీ ముందు డిమాండ్ పెట్టారు.