పెళ్లి మండంపం అందంగా డెకరేట్ చేశారు.  మంగళవాద్యాలు.. బంధుమిత్రులతో అంతా సందడి గా ఉంది. వధూవరులు పెళ్లిపీటలపై కూర్చొని ఉండగా..  పురోహితుడు వేదమంత్రాలు చదువుతున్నాడు. మరికొద్ది క్షణాల్లో తాళి కడతారనగా.... మండపంలోకి పోలీసులు వచ్చారు. 

వధువుకి పెళ్లి ఇష్టం లేదని.. తమను ఆమె పిలిచిందంటూ పెళ్లి రద్దు చేశారు. ఈ సంఘటన మహబూబాబాద్ జిల్లా మరిపెడ పట్టణంలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

మరిపెడ మండలం గుండెపూడికి చెందిన యువకుడికి, కురవి మండలం కాంపెల్లికి చెందిన యువతితో పెళ్లి నిశ్చయమైంది. పెద్దలు కుదర్చిన వివాహం ఇష్టంవ లేని వధువు ఏకంగా పోలీసులను ఫోన్ చేసింది. తాను వేరే యువకుడిని ప్రేమించానని.. బలవంతంగా వేరే వ్యక్తితో పెళ్లి చేస్తున్నారని చెప్పింది. ఆమె అభ్యర్థన మేరకు పోలీసులు వచ్చి పెళ్లిని ఆపేశారు.

యువతికి ఎంత నచ్చచెప్పే ప్రయత్నం చేసినా ఆమె వినకపోవడం గమనార్హం. దీంతో.. ఈ సంఘటనను అవమానకరంగా భావించిన వరుడు కుటుంబసభ్యులు..  వెంటనే ఆ పెళ్లికి వచ్చిన బంధువుల అమ్మాయితో పెళ్లి జరిపించడం గమనార్హం. అదే మండపంలో పెళ్లి జరిపించి.. వధూవరులను ఇంటికి తీసుకువెళ్లారు.