మద్యానికి బానిసై.. జులాయిగా తిరుగుతున్న ఒక అన్న.. తమ్ముడి పెళ్లయితే తనను ఎక్కడ బయటకు గెంటేస్తారో అన్న భయంతో సోదరుడి పెళ్లిని ఆపడానికి నాయనమ్మను హత్య చేశాడు
మద్యానికి బానిసై.. జులాయిగా తిరుగుతున్న ఒక అన్న.. తమ్ముడి పెళ్లయితే తనను ఎక్కడ బయటకు గెంటేస్తారో అన్న భయంతో సోదరుడి పెళ్లిని ఆపడానికి నాయనమ్మను హత్య చేశాడు. మేడ్చల్ జిల్లా కీసరలో కొద్దిరోజుల క్రితం జరిగిన వృద్ధురాలి హత్య కేసును ఛేదించే క్రమంలో నివ్వేరపోయే వాస్తవాలను బయటపెట్టారు. కీసరకు చెందిన పురాన పెద్దమ్మకు ముగ్గురు కొడుకులు, ముగ్గురు కుమార్తెలు.
పెద్దమ్మ చిన్న కుమారుడు లక్ష్మయ్య స్థానిక నందినీ నగర్‌లో ముగ్గురు కుమారులతో కలిసి ఉంటున్నాడు.. ఇద్దరు కొడుకులు పెళ్లిళ్లు చేయగా.. చిన్న కుమారుడికి సంబంధాలు చూస్తున్నాడు లక్ష్మయ్య. ఓ కంపెనీలో పని చేసే పెద్ద కుమారుడు శ్రీకాంత్ మద్యానికి బానిసై.. ఇంటిని పట్టించుకోవడం మానేశాడు.. జులాయిగా తిరుగుతూ వచ్చిన డబ్బులన్ని తాగుడికే ఖర్చు చేసేవాడు.
ఈ క్రమంలో తమ్ముడికి పెళ్లయితే తాను ఇంట్లోంచి బయటకు వెళ్లిపోవాల్సి వస్తుందని శ్రీకాంత్ భయపడిపోయాడు. ఎలాగైనా తమ్ముడి పెళ్ళి ఆపాలని నిర్ణయించుకున్నాడు. ఇంట్లో ఎవరైనా చనిపోతే పెళ్లి ఆగిపోతుందని భావించి.. నానమ్మను చంపేస్తే ఏడాది పాటు పెళ్లి ఆగిపోతుందని భావించాడు. అనుకున్నదే తడవుగా గత శనివారం మేనత్త దగ్గర ఉన్న నాయనమ్మ దగ్గరకు వెళ్లాడు.
చాన్నాళ్ల తర్వాత మనవడు రావడంతో సంబరపడిపోయిన పెద్దమ్మ.. యోగక్షేమాలు కనుక్కొని ఆ రాత్రి తన దగ్గరే ఉండమని చెప్పింది. నాయనమ్మ పడుకున్నాకా ఆమె ముఖంపై దిండు అదిమి పెట్టాడు.. దాంతో ఊపిరాడక గిలగిలా కొట్టుకుని ప్రాణాలు విడిచింది.. అనంతరం ఆమె ఒంటిపై ఉన్న బంగారు నగలను తీసుకుని వెళ్ళిపోయాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు శ్రీకాంత్‌పై అనుమానంతో విచారించగా.. అసలు నిజం వెలుగులోకి వచ్చింది. శ్రీకాంత్ గతంలోనూ ఓ హత్య కేసులో శిక్ష అనుభవించినట్లు పోలీసులు తెలిపారు.
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Jul 24, 2018, 11:29 AM IST