గణతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వ వైఖరిపై రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది.

గణతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వ వైఖరిపై రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాజ్‌భవన్‌లోనే రిపబ్లిక్ డే వేడుకలను నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ లేఖ నేపథ్యంలో.. గవర్నర్ తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్టుగా రాజ్‌భవన్‌ వర్గాలు తెలిపాయి. దేశంలోని ప్రతీ రాష్ట్రంలో ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు జరుగుతున్న తరుణంలో తెలంగాణ రాష్ట్రంలో వేడుకలు జరగకపోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేసినట్టుగా తెలిసింది. ఇది రాజ్యాంగ స్ఫూర్తిని గౌరవించకపోవడమేనని గవర్నర్ అభిప్రాయపడినట్టుగా సమాచారం. 

ఖమ్మంలో ఐదు లక్షల మందితో బహిరంగ సభ నిర్వహిస్తే లేని కోవిడ్.. పరేడ్ గ్రౌండ్‌లో రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహిస్తే వస్తుందా? అని గవర్నర్ ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది. గణతంత్ర దినోత్సవ వేడుకల విషయంలో ప్రభుత్వ వైఖరిని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని కూడా గవర్నర్ తమిళిసై నిర్ణయించినట్టుగా సమాచారం. ఇదిలా ఉంటే.. రాజ్‌భవన్‌లో జెండా ఎగరవేసిన అనంతరం ఆమె పుదుచ్చేరి వెళ్లనున్నారు. అక్కడ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న అనంతరం.. తిరిగి హైదరాబాద్‌కు చేరుకుంటారు. సాయంత్రం హైదరాబాద్‌కు చేరుకుని రాజ్‌భవన్‌లో ఎట్ హోమ్ కార్యక్రమంలో పాల్గొననున్నారు.

ఇక, గణతంత్ర దినోత్సవ వేడుకలకు సంబంధించి గవర్నర్ తమిళిసైకి తెలంగాణ సర్కారు లేఖ రాసింది. రాజ్ భవన్ లోనే రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహించాలని లేఖలో పేర్కొంది. 

ఇదిలా ఉంటే.. తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్, గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్‌ల మధ్య విభేదాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో గతేడాది మాదిరిగానే.. ఈసారి కూడా గణతంత్ర దినోత్సవ వేడుకుల రాజభవన్‌కే పరిమితం కానున్నాయి. తెలంగాణలో కరోనాకు ముందు పబ్లిక్ గార్డెన్స్‌లో గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు. 2019లో తెలంగాణ గవర్నర్‌గా తమిళిసై సౌందర్‌రాజన్ బాధ్యతలు చేపట్టగా.. 2020లో పబ్లిక్ గార్డెన్స్‌లోనే గణతంత్ర దినోత్సవ వేడుకలను ప్రభుత్వం ఘనంగా చేపట్టింది. 2021లో కూడా పబ్లిక్ గార్డెన్స్‌లోనే గణతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించినా.. కరోనా నేపథ్యంలో కొద్ది మంది అతిథుల సమక్షంలో సాదాసీదాగా జరిగింది. ఈ రెండు సందర్భాల్లో సీఎం కేసీఆర్, గవర్నర్ తమిళిసై, మంత్రులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు హాజరయ్యారు. అయితే ఆ తర్వాత గవర్నర్‌కు, సీఎంకు మధ్య విభేదాలు చోటుచేసుకున్నాయి. కేసీఆర్ ప్రభుత్వంతో గవర్నర్‌కు సంబంధాలు దెబ్బతిన్నాయి. ఎమ్మెల్సీగా పాడి కౌశిక్ రెడ్డికి సంబంధించిన ఫైలును గవర్నర్‌ పక్కన పెట్టడంతో విభేదాలు ముదిరాయి. 

ఈ క్రమంలోనే 2022 జనవరి 26న గణతంత్ర దినోత్సవం రాజ్‌భవన్‌కే పరిమితమైంది. కరోనా కారణంగా పబ్లిక్‌ గార్డెన్‌లో ఉత్సవం నిర్వహించే పరిస్థితి లేదని, రాజ్‌భవన్‌లోనే నిర్వహించుకోవాలని సూచించింది. ఆ వేడుకలకు సీఎం కేసీఆర్‌తో పాటు, మంత్రులు కూడా దూరంగా ఉన్నారు. దీంతో రాజ్‌భవన్‌లోనే జాతీయ జెండా ఆవిష్కరించిన గవర్నర్ తమిళిసై.. తన సొంత ప్రసంగాన్ని చదివి వినిపించారు. ఇక, ఆ తర్వాత కూడా ఈ విభేదాలు కొనసాగుతూనే వచ్చాయి.