Asianet News TeluguAsianet News Telugu

నిలోఫర్ ఆస్పత్రి ఘటనపై గవర్నర్ తమిళిసై సీరియస్.. విచారణ జరిపించాలి..

హైదరాబాద్ నిలోఫర్ ఆస్పత్రిలో (Niloufer Hospital) వార్డు  బాయ్ నిర్లక్ష్యం  కారణంగా మూడున్నరేళ్ల బాలుడు మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ (Tamilisai Soundarajan) సీరియస్‌గా రియాక్ట్ అయ్యారు.

Governor Dr Tamilisai Soundararajan serious view on small boy death at Niloufer Hospital
Author
Puducherry, First Published Nov 2, 2021, 9:35 AM IST

హైదరాబాద్ నిలోఫర్ ఆస్పత్రిలో (Niloufer Hospital) వార్డు  బాయ్ నిర్లక్ష్యం  కారణంగా మూడున్నరేళ్ల బాలుడు మరణించిన సంగతి తెలిసిందే. 100 రూపాయల కోసం కక్కుర్తిపడిన వార్డు బాయ్  బాలుడికి పెట్టిన ఆక్సిజన్ పైపును తీసి మరో రోగికి అమర్చాడు. దీంతో బాలుడు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయి ప్రాణాలు విడిచాడు. ఈ ఘటనపై బాలుడి కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చాలా మంది జనాలు కూడా వార్డు బాయ్, ఆస్పత్రి నిర్లక్ష్యంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఈ ఘటనపై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ (Tamilisai Soundarajan) సీరియస్‌గా రియాక్ట్ అయ్యారు. సోమవారం పుదుచ్చేరిలో ఉన్న ఆమె ఈ విషయం తెలియడంతో స్పందించారు. ఈ ఘటన చాలా భయకరమైనదని.. ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని అన్నారు. నిలోఫర్ ఆస్పత్రిలో జరుగుతున్న ఇలాంటి ఘటనలకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాలుడి మృతిపై విచారణ జరిపించాలని కోరారు. 

Also read: హైదరాబాద్: కేవలం వంద రూపాయల కోసం... చిన్నారి ప్రాణాలు బలితీసుకున్న వైద్యసిబ్బంది

జౌట్ సోర్సింగ్ సిబ్బందిగా ఉన్న వార్డు బాయ్‌ను వెంటనే సస్పెండ్ చేశామని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మురళీకృష్ణ (Dr Muralikrishna) తెలిపారు. బాలుడికి చికిత్స పరంగా ఎటువంటి తప్పు జరగలేదని వైద్య విద్యా డైరెక్టర్ డాక్టర్ కె రమేష్ రెడ్డి తెలిపారు. మరోవైపు ఈ ఘటనకు సంబంధించి సోమవారం జూనియర్ డాక్టర్ నిరసన తెలిపారు. ఆస్పత్రిని ఎలా రన్ చేస్తున్నారని ప్రశ్నల వర్షం కురిపించారు. ఔట్ సోర్సింగ్ కార్మికులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రోగులను, వారి అటెండెంట్‌ల నుంచి డబ్బులు వసూలు చేయడం కొందరు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు అలవాటుగా మారిందని.. ఇలాంటి చర్యలకు వైద్యులను బాధ్యులను చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే డాక్టర్ మురళీ కృష్ణ నిరసన తెలుపుతున్న జూనియర్ డాక్టర్‌తో చర్చలు జరిపారు. సమస్యలను క్రమబద్దీకరించడానికి మూడు రోజుల సమయం కావాలని ఆయన జూడాలను కోరిన్టటుగా తెలిసింది. 

అసలేం జరిగిందంటే..
ఎర్రగడ్డకు చెందిన మహ్మద్ ఆజం కొడుకు ఖాజా కొంతకాలం ఉపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నాడు. అతడిని తొలుత ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించగా.. రెండు లక్షల బిల్లు అయ్యింది. అయితే వాటిని భరించలేని బాలుడి కుటుంబ సభ్యులు నిలోఫర్ ఆస్పత్రికి తరలించారు. బాలుడి ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా వెంటిలేటర్‌పై ఉంచారు. శనివారం స్కానింగ్ తీయించాల్సి ఉంది. అక్కడికి తీసుకెళ్లడానికి ఆక్సిజన్ సిలిండర్ అవసరం ఉంది. అయితే ఈలోగా బాలుడికి అమర్చిన ఆక్సిజన్ పైపును.. ఔట్స్ సోర్సింగ్ ద్వారా విధుల్లో ఉన్న వార్డు బాయ్ సుభాష్ వేరే వారి నుంచి రూ. 100 తీసుకుని పక్క బెడ్‌పై ఉన్న రోగికి అమర్చాడు. ఈ క్రమంలోనే బాలుడి ఆరోగ్య పరిస్థితి విషమించి మరణించాడు. దీంతో బాలుడి కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. సిబ్బంది, వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే ఇలా జరిగిందని వారు ఆరోపించారు.  

Follow Us:
Download App:
  • android
  • ios