ఎలాంటి సెక్యురిటీ లేకుండా.. మెట్రోలో పర్యటించిన గవర్నర్ దంపతులు

First Published 16, Jul 2018, 12:04 PM IST
Governor and wife ride Hyderabad Metro without security
Highlights

అకస్మాత్తుగా మెట్రోరైలులో గవర్నర్‌ దంపతులు ప్రత్యక్షం కావడంతో ప్రయాణికులతో పాటూ మెట్రో సిబ్బంది ఆశ్చర్యపోయారు.

తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ దంపతులు ఆదివారం మెట్రో రైలులో ప్రయాణించారు. ఎలాంటి సెక్యురిటీ లేకుండా.. కనీసం ముందస్తు సమాచారం కూడా ఇవ్వకుండా అకస్మాత్తుగా మెట్రోరైలులో గవర్నర్‌ దంపతులు ప్రత్యక్షం కావడంతో ప్రయాణికులతో పాటూ మెట్రో సిబ్బంది ఆశ్చర్యపోయారు.

 సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో గవర్నర్‌ దంపతులు రాజ్‌భవన్‌ నుంచి నేరుగా బేగంపేట మెట్రో స్టేషన్‌కు చేరుకున్నారు. సాధారణ ప్రయాణికుల మాదిరిగా మియాపూర్‌ వరకు టిక్కెట్‌ తీసుకుని మెట్రో ఎక్కారు. అమీర్‌పేటలో ఇంటర్‌ఛేంజ్‌ స్టేషన్‌లో దిగి అక్కడి నుంచి మియాపూర్‌ వెళ్లే మెట్రోరైలు ఎక్కారు ఈ లోపు ఎల్‌ అండ్‌ టీ సిబ్బంది గవర్నర్‌ను గుర్తించి.. ఎండీ ఎన్వీఎస్‌రెడ్డికి సమాచారమిచ్చారు. 

ఆ సమయంలో కూకట్‌పల్లిలో పనులను పరిశీలిస్తున్న ఆయన వెంటనే మియాపూర్‌ చేరుకుని గవర్నర్‌ దంపతులకు స్వాగతం పలికారు. తాను సాధారణ ప్రయాణికుడిగా వచ్చానని స్వాగత అర్భాటం వద్దని గవర్నర్‌ తిరస్కరించారు. ప్రయాణికులకు అసౌకర్యం కల్గకూడదనే షరతుతో తర్వాత అంగీకరించడంతో మెట్రో ఎండీ దగ్గరుండి మియాపూర్‌ స్టేషన్‌ పరిసరాలను చూపించారు. అనంతరం మియాపూర్‌లో మెట్రో ఎక్కి అమీర్‌పేటలో దిగి.. అక్కడి నుంచి మరో మెట్రోలో బేగంపేటకు చేరుకున్నారు.

loader