Asianet News TeluguAsianet News Telugu

హోంమంత్రి నాయిని కి సర్కారు బడి పంతుళ్ల షాక్

  • టీచర్స్ డే సభలో వాగ్వాదం
  • టీచర్లపై నాయిని గరం గరం వ్యాఖ్యలు
  • ప్రతిఘటించిన పంతుళ్లు
  • మాటలు వెనకకు తీసుకున్న హోం
government teachers fire on home minister naini

తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహ్మారెడ్డికి ప్రభుత్వ ఉపాధ్యాయులు షాక్ ఇచ్చారు. హైదరాబాద్ లోని ప్రియదర్శిని ఆడిటోరియంలో శుక్రవారం ఈ సంఘటన జరిగింది. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

నాంపల్లి ప్రియదర్శిని ఆడిటోరియంలో ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా సభ జరిగింది. దీనికి హోమంత్రి నాయినితోపాటు జిల్లా కలెక్టర్ యోగితా రాణా హాజరయ్యారు. ఈ సందర్భంగా నాయిని మాటలు సభలో వివాదానికి, గందరగోళానికి దారి తీశాయి.

మీ పిల్లలను కార్పొరేట్ స్కూళ్లలో చదివిస్తున్నరు, కొంత మంది టీచర్లు ప్రయివేటు వ్యాపారాలు చేసుకుంటున్నారు, సర్కారు బడుల్లో పిల్లలను చేర్పిస్తలేరు అంటూ హోమంత్రి నాయిని సభలో మాట్లాడారు. దీంతో ప్రభుత్వ టీచర్లు గరం గరం అయ్యారు.

రాజకీయ నాయకులు, ఎంపిలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రుల పిల్లలు ఎక్కడ చదువుతున్నారని ప్రశ్నించారు. మీరు మాత్రం గవర్నమెంట్ బడిలో చదించరు కానీ మేము చదివించాలా అని ప్రశ్నించారు. దమ్ముంటే రాజకీయ నాయకుల పిల్లలను సర్కారు బడిలోనే చదివించండి మేము కూడా చదివిస్తాం అంటూ సవాల్ చేశారు కొందరు టీచర్లు. అయితే మళ్లీ నాయిని స్పందించి ముందు టీచర్లే తమ పిల్లలను తాము చదువు చెబుతున్న పాఠశాలల్లో చదివించాలి కదా అని ప్రశ్నించారు.

ఈ వాగ్వాదం ఇలా జరుగుతుండగానే కలెక్టర్ యోగితా రాణా కల్పించుకున్నారు. సభకు వచ్చిన వారిలో ఎంత మంది టీచర్లు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చదివిస్తున్నారని అడిగారు. అలా చదివించే టీచర్లు చేతులెత్తాలంటూ ఆదేశించారు. అయితే సభలో ఉన్న ఇద్దరు టీచర్లు మాత్రమే చేతులెత్తారు.

ఆ తర్వాత కూడా టీచర్ల నిరసన కొనసాగింది. నువ్వు మా శాఖ మంత్రివే కావు మమ్మల్ని తిడతావా అంటూ టీచర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో టీచర్ల ఆగ్రహాన్ని చవిచూసిన హోంమంత్రి నాయిని వెంటనే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారు. దీంతో వివాదం సద్దుమణిగింది.

మొత్తానికి ప్రభుత్వ పాఠశాలలంటే రాజకీయ నాయకులు, టీచర్లకు ఇద్దరికీ ఏరకమైన భావన ఉందో ఈ సంఘటన ద్వారా తెలుస్తోందని జనాలు ముక్కుమీద వేలేసుకుంటన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios