Asianet News TeluguAsianet News Telugu

నిధుల సమీకరణలో భారీ కొరత.. కీలక నిర్ణయం తీసుకోనున్న కేసీఆర్!.. వచ్చే నాలుగు నెలలు ఇబ్బందికరమేనా..?

నిధుల సమీకరణలో భారీ కొరత ఏర్పడిన నేపథ్యంలో తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

Government Facing huge shortfall in fund mobilisation How KCr Will Takle
Author
First Published Nov 26, 2022, 9:30 AM IST

నిధుల సమీకరణలో భారీ కొరత ఏర్పడిన నేపథ్యంలో తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం(2022-23)లో మిగిలిన నాలుగు నెలల్లో అంటే వచ్చే ఏడాది మార్చి 31 వరకు అన్ని శాఖలు తమ వ్యయాన్ని 30 నుంచి 50 శాతం తగ్గించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం కోరే అవకాశం ఉంది. వచ్చే ఏడాది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ.. సంక్షేమ పథకాల అమలుకు ఆర్థిక సంక్షోభం ఎదురుకానుండటం కూడా అధికార టీఆర్ఎస్‌ ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

కేంద్రం రుణాలపై ఆంక్షలు విధించడంతో రాష్ట్ర ప్రభుత్వం రూ.40,000 కోట్ల లోటును ఎదుర్కొంటోందని.. ఇది రూ. 70,000 కోట్లకు పెరగవచ్చని ఆర్థిక శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. వచ్చే నెలలో నిర్వహించే అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో కేంద్రం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి జరిగిన నష్టాన్ని ప్రజలకు తెలియజేసేందుకు వినియోగించుకునే అవకాశం ఉంది. ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితులు, మార్కెట్ రుణాల వంటి వాటిపై కేంద్రం ఆంక్షలపై చర్చించనున్నారు. ఈ క్రమంలోనే ఆర్థిక శాఖ అధికారులు గణంకాలను సిద్దం చేసే పనిలో పడ్డారు. 

రూ.40,000 కోట్ల బడ్జెట్ అంచనాలకు గాను తెలంగాణకు కేవలం రూ.10,000 కోట్లు మాత్రమే కేంద్ర గ్రాంట్ల రూపంలో వస్తాయని అంచనా వేసింది. రూ.15,000 కోట్ల విలువైన మార్కెట్ రుణాలకు కేంద్రం అనుమతి నిరాకరించడంతో రూ. 54,000 కోట్ల నుంచి రూ. 39,000 కోట్లకు తగ్గించింది. రెవెన్యూ మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణకు కేంద్రం అదనంగా 0.5 శాతం ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితిని కేంద్రం అనుమతించలేదు. కేంద్రం ఈ ప్రయోజనాన్ని విద్యుత్ రంగ సంస్కరణలతో ముడిపెట్టింది. దీని ఫలితంగా రాష్ట్రానికి రూ.6,000 కోట్ల నష్టం వాటిల్లింది. అయితే విద్యుత్ రంగ సంస్కరణలను రైతు వ్యతిరేకమైనవిగా పేర్కొన్న తెలంగాణ సర్కార్.. వాటిని రాష్ట్రంలో అమలు చేయడానికి నిరాకరించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ విషయానికి సంబంధించి పలు సందర్భాల్లో కేంద్రంపై తీవ్ర విమర్శలు చేశారు. 

ఇక, రూ. 20,000 కోట్ల మేర బడ్జెట్‌కు మించి రుణాలు తీసుకోవడంపై కేంద్రం ఆంక్షలు విధించింది. వీటన్నింటి ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వానికి దాదాపు 40,000 కోట్ల రూపాయల లోటు ఏర్పడింది. అయితే..  సీఎం మళ్లీ బడ్జెట్‌ను తగ్గించే అవకాశం లేకపోలేదని అధికార వర్గాల్లో చర్చ సాగుతుంది. ఆర్థిక మందగమనం, కేంద్ర నిధులు, గ్రాంట్‌లలో తీవ్రమైన కోతలను పేర్కొంటూ 2019-20లో బడ్జెట్ పరిమాణాన్ని సీఎం కేసీఆర్ 20 శాతం తగ్గించారు.

అయితే.. ప్రస్తుతానికి ఆదాయం, వ్యయాల మధ్య అంతరాన్ని పూరించడానికి ప్రభుత్వం తన సొంత పన్ను రాబడులు, పన్నేతర ఆదాయాలు, భూముల అమ్మకాలపై ఆధారపడి ఉంది. అయితే రూ. 25,000 కోట్ల లక్ష్యానికి గాను రూ. 9,000 విలువైన భూములను మాత్రమే ప్రభుత్వం విక్రయించగలిగింది. ఈ ఆర్థిక సంవత్సరంలో మిగిలిన నాలుగు నెలల్లో భూముల విక్రయాలను వేగవంతం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

రబీ సీజన్‌కు రైతుబంధు కోసం రూ. 7,500 కోట్లు సమీకరించడంపై ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారించినట్టుగా తెలుస్తోంది. అలాగే 118 నియోజకవర్గాల్లో (హుజురాబాద్ మినహా) ఒక్కో నియోజక వర్గంలో 500 మంది లబ్ధిదారులకు దళిత బంద్‌కు రూ. 5,900 కోట్లు కావాల్సి ఉంది. అయితే ప్రస్తుత పరిస్థితులను గమనిస్తే.. ఈ ఆర్థిక సంవత్సరంలో రెండో దశ, మూడో దశ దళిత బంధును ప్రభుత్వం అమలు చేస్తుందా? లేదా? అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.  మరోవైపు ఖర్చులను తగ్గించుకునేందుకు ప్రభుత్వం వెరిఫికేషన్ అనంతరం పెద్ద ఆసరా పింఛన్లను కూడా తొలగిస్తున్నట్టుగా తెలుస్తోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios