చర్లపల్లి జైలుకు రాజాసింగ్ తరలింపు: మానస బ్యారక్ కేటాయింపు
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ను పోలీసులు గురువారం నాడు సాయంత్రం చర్లపల్లి జైలుకు తరలించారు. రాజాసింగ్ పై పీడీయాక్ట్ నమోదు చేశారు.
హైదరాబాద్: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ను పోలీసులు గురువారం నాడు సాయంత్రం చర్లపల్లి జైలుకు తరలించారు. జైలులోని మానస బ్యారక్ ను రాజాసింగ్ కు కేటాయించారు. ఇవాళ మధ్యాహ్నం రాజాసింగ్ ను ఆయన ఇంటివద్దనే పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేయడానికి ఇంటికి వచ్చిన సమయంలోనే రాజాసింగ్ కు పోలీసులు పీడీ యాక్ట్ నోటీసులు ఇచ్చారు. రాజాసింగ్ ను అరెస్ట్ చేసిన తర్వాత గాంధీ ఆసుపత్రికి తరలించారు. గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అక్కడి నుండి ఆయనను పోలీసులు చర్లపల్లి జైలుకు తరలించారు.
గతంలో నమోదైన కేసుల ఆధారంగానే గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పై పీడీ యాక్ట్ నమోదు చేసినట్టుగా హైద్రాబాద్ సీపీ సీవీ ఆనంద్ చెప్పారు. రాజాసింగ్ పై 2004 నుండి నమోదైన కేసుల గురించి సీవీ ఆనంద్ మీడియాకు వివరించారు. రాజాసింగ్ పై నమోదైన కేసుల్లో క్రిమినల్ కేసులతో పాటు 16 కమ్యూనల్ కేసులు కూడా ఉన్న విషయాన్ని పోలీసు ఉన్నతాధికారులు చెప్పారు.. మంగళ్ హట్ పోలీస్ స్టేషన్ లో రాజాసింగ్ పై రౌడీషీట్ నమోదైన విషయాన్ని సీవీ ఆనంద్ గుర్తు చేశారు.
ఇవాళ ఉదయమే గతంలో నమోదైన కేసులకు సంబంధించి పోలీసులు 41 (ఎ) సీఆర్‌పీసీ సెక్షన్ కింద నోటీసులు ఇచ్చారు. షాహినాయత్ గంజ్ పోలీస్ స్టేషన్ తో పాటు మంగళ్ హాట్ పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసులకు సంబంధించి పోలీసులు నోటీసులు జారీ చేశారు.ఈ నోటీసులు జారీ చేయడంతో పోలీసులు తనను పాత కేసుల్లో అరెస్ట్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారని రాజాసింగ్ అనుమానం వ్యక్తం చేశారు. తాను దేనికైనా సిద్దంగానే ఉన్నానని కూడా రాజాసింగ్ ప్రకటించారు. ఈ మేరకు ఆయన మీడియాకు వీడియోను విడుదల చేశారు.ఈ వీడియో విడుదల చేసిన కొద్దిసేపటికే రాజసింగ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.
also read:రాజా సింగ్‌పై గతంలోనే రౌడీషీట్, 100కు పైగా క్రిమినల్ కేసులు.. పీడీ యాక్ట్ నమోదు చేయడంపై సీవీ ఆనంద్
ఇటీవలనే రాజాసింగ్ యూట్యూబ్ లో అప్ లోడ్ చేసిన వీడియో హైద్రాబాద్ లో టెన్షన్ కు కారణమైంది. ఈ వీడియోలో మహ్మద్ ప్రవక్తను కించపర్చేలా రాజాసింగ్ వ్యాఖ్యలు చేశారని ఎంఐఎం ఆరోపించింది.ఈ విషయమై రాజాసింగ్ పై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆందోళనలు నిర్వహించింది.