ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటన నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలపై విరుచుకుపడ్డారు గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్. కేసీఆర్, కేటీఆర్‌లకు దమ్ముంటే మోడీని కలవాలని ఆయన సవాల్ విసిరారు.  

ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటన నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలపై విరుచుకుపడ్డారు గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్. ప్రధాని మోడీకి ముఖం చూపించుకోలేకనే అనవసరంగా విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. మోడీకి వ్యతిరేకంగా పోస్టర్లు వేసి ప్రజల్లో అభాసుపాలు కావొద్దని రాజాసింగ్ హితవు పలికారు. కేసీఆర్, కేటీఆర్‌లకు దమ్ముంటే మోడీని కలవాలని ఆయన సవాల్ విసిరారు. మోడీని కలిసి తెలంగాణకు ఎలాంటి ప్రాజెక్ట్‌లు కావాలో అడగాలని.. రాష్ట్రానికి ఏం నిధులు కావాలో ఎందుకు అడగరని రాజాసింగ్ ప్రశ్నించారు. ఎంఐఎం, బీఆర్ఎస్‌లు వెన్నుపోటు పార్టీలని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 

కాగా.. మోడీ తెలంగాణ ప‌ర్య‌ట‌న నేప‌థ్యంలో బీజేపీపై అధికార భార‌త రాష్ట్ర స‌మితి (బీఆర్ఎస్) తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పిస్తోంది. తెలంగాణ‌లో ప‌ర్య‌టించే నైతిక హ‌క్కు మోడీకి లేద‌ని మండిప‌డుతోంది. మోడీ పర్యటనకు ఒక రోజు ముందు బీఆర్ఎస్ తెలంగాణను అవమానించిన తర్వాత రాష్ట్రంలో పర్యటించే నైతిక‌ హక్కు ఆయ‌న‌కు లేదని వాల్ పోస్టర్లు అంటించింది. రాష్ట్ర ఆవిర్భావాన్ని అవమానించిన మోడీకి తెలంగాణలో పర్యటించే నైతిక హక్కు లేదంటూ హైదరాబాద్ లో అతికించిన పోస్టర్లలో పేర్కొన్నారు.

Also Read: తెలంగాణలో మోడీ టూర్: ఏడో దఫా కేసీఆర్ దూరం

తెలంగాణ ఏర్పాటుపై వివిధ సందర్భాల్లో పార్లమెంటులో మోడీ మాట్లాడిన నాలుగు వేర్వేరు చిత్రాలను ఈ పోస్టర్లలో పొందుపరిచారు. 'బిడ్డను కాపాడేందుకే తల్లిని చంపారు' అన్న ప్రధాని వ్యాఖ్యలను కూడా వారు ప్రస్తావించారు. 2018, 2022, 2023 సంవత్సరాల్లో తెలంగాణ ఏర్పాటుపై మోడీ చేసిన ప్రసంగాలలోని ప‌లు వ్యాఖ్య‌ల‌ను ప్ర‌స్తావించారు. సెప్టెంబర్ 18న ఆయన చేసిన వ్యాఖ్యల నుంచి 'తెలంగాణ కుష్ నహీ థా' అనే కామెంట్ ను ప్ర‌స్త‌వించారు.

తెలంగాణ ఏర్పాటు విష‌యంలో వివిధ సంద‌ర్భాల్లో ప్ర‌ధాని చేసిన వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల‌ను ఇప్పటికే బీఆర్ఎస్ ఖండించింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై పార్లమెంటులో చేసిన వ్యాఖ్యలు చారిత్రక వాస్తవాలను పూర్తిగా విస్మరించడాన్ని ప్రతిబింబిస్తున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావు (కేటీఆర్) అన్నారు.