బంగారు ఆభరణాలకు మెరుగు పెడతామంటూ మాయ మాటలతో నమ్మించి, నిలువునా ముంచేశారు. ఎనిమిది తులాల బంగారంతో ఉడాయించారు. ఈ ఘటన కరీంనగర్​లో జరిగింది. దుండగులు పారిపోతున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.    

"

బంగారాన్ని మెరుగు పెడతామంటూ విశ్వబ్రాహ్మణులను మోసం చేసిన సంఘటన కరీంనగర్​లో చోటుచేసుకుంది. ఇంట్లో నుంచి నగలు తీసుకుని పారిపోతున్న దృశ్యాలు సీసీ కెమెరాలో నమోదయ్యాయి.  స్థానిక బోయవాడలోని వీరహనుమాన్‌ ఆలయం వద్ద ఇద్దరు ఉద్యోగుల తరహాలో.. సూటూ, బూట్లతో వాసరయ్య అనే వ్యక్తి ఇంట్లోకి వెళ్లారు. 

బంగారు ఆభరణాలను క్షణాల్లో మెరుగు పెడతామని నచ్చజెప్పారు. అనుమానం రావడంతో తొలుత వారు ఆభరణాలు ఇవ్వడానికి తటపటాయించారు. ఈ క్రమంలో మెడలోని పుస్తెలతాడుకు ఏదో రసాయనం పూశారు. క్షణాల్లో ఎలా మెరుగు పెట్టామో చూడండని నమ్మించారు.

ఓ వ్యక్తి ముందుగానే బయటికి వచ్చి ద్విచక్రవాహనంపై సిద్ధంగా ఉన్నాడు. మెడలోని పుస్తెలతాడుకు రసాయనం పూసే క్రమంలో ఆ వాసనకు మహిళకు తల తిరిగినట్లైంది. తన మెడలోని పుస్తెలతాడుతోపాటు చంద్రహారం సహా.. మొత్తం ఎనిమిది తులాల బంగారు ఆభరణాలు వారికి అప్పగించారు. 

ఆ పుత్తడి తీసుకుని వెంటనే ఇంటి నుంచి బయటికి వచ్చిన అతడు.. బయట సిద్ధంగా ఉన్న మరో వ్యక్తి బైక్​పై ఎక్కి పరారయ్యాడు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.