సారాంశం

భారీ వర్షాలు, ఎగువ నుంచి వస్తున్న వరద నేపథ్యంలో భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహం గంట గంటకూ పెరుగుతోంది. శుక్రవారం సాయంత్రానికి నీటిమట్టం 60 అడుగులకు చేరే అవకాశం వుండటంతో దిగువ ప్రాంతాల ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. 

భారీ వర్షాలు, ఎగువ నుంచి వస్తున్న వరద నేపథ్యంలో భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహం గంట గంటకూ పెరుగుతోంది. శుక్రవారం ఉదయం 6 గంటలకు 46.20 అడుగులు వున్న ప్రవాహం మధ్యాహ్నానికి 48 అడుగులకు చేరింది. వరద తగ్గిందని తొలుత భావించినప్పటికీ ఎగువ ప్రాజెక్ట్‌ల నుంచి దిగువకు నీటిని వదులుతూ వుండటంతో భద్రాచలం వద్దకు వరద నీరు పోటెత్తింది. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. శుక్రవారం సాయంత్రానికి నీటిమట్టం 60 అడుగులకు చేరే అవకాశం వుండటంతో దిగువ ప్రాంతాల ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. 

ఇకపోతే.. ములుగు జిల్లా వాజేడు, వెంకటాపురం మండలాల్లో వరద రోడ్లపైకి చేరింది. టేకులగూడెం, వీరభద్రవరం, సురవీడు ప్రాంతాలకు రాకపోకలకు నిలిచిపోయాయి. రామన్నగూడెం పుష్కర ఘాట్ వద్ద అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. గోదావరి పరవళ్ల నేపథ్యంలో తీర ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నామని అధికారులు పేర్కొన్నారు. అత్యవసర పరిస్ధితుల్లో వున్న వారు కంట్రోల్ రూమ్‌కి సమాచారం అందించాలని.. వాగులు, వంకలు దాటే ప్రయత్నం చేయొద్దని జిల్లా కలెక్టర్ సూచించారు. 

Also Read: నిర్మల్ : గ్రామాన్ని ముంచెత్తిన వరదనీరు... ప్రాణభయంతో కొండపైకి పరుగుతీసిన ప్రజలు (వీడియో)

మరోవైపు.. వరద తగ్గుముఖం పట్టడంతో  మోరంచపల్లివాసులు  శుక్రవారం నాడు గ్రామానికి  చేరుకున్నారు. వరద మిగిల్చిన బురదతో గ్రామస్తులు కన్నీరు పెట్టుకున్నారు. ఈ వాగు వరదలో గ్రామస్తులు సర్వం కోల్పోయారు. బురదతో నిండిపోయిన ఇళ్లను చూసి స్థానికులు కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇళ్లకు  చేరుకున్న  స్థానికులు  ఒకరినొకరు  పట్టుకుని  ఏడ్చారు. 12 గంటల పాటు వరద నీటిలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గ్రామస్తులు గడిపారు. ఈ గ్రామంలో 250 కుటుంబాలు నివాసం ఉంటాయి.