నిజామాబాద్ IT Hubలో కంపెనీ పెట్టడానికి గ్లోబల్ లాజిక్ సంస్థ సానుకూలం: కంపెనీ ప్రతినిధులతో ఎమ్మెల్సీ కవిత భేటీ

నిజామాబాద్ ఐటీ హబ్‌లో కంపెనీ పెట్టడానికి గ్లోబల్ లాజిక్ సంస్థ సానుకూలంగా స్పందించిందని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. మంగళవారం ఆ కంపెనీ ప్రతినిధులు నిజామాబాద్ ఐటీ హబ్ సందర్శిస్తారని వివరించారు. ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే బాజీరెడ్డి గోవర్దన్, షకీల్‌లు కంపెనీ ప్రతినిధులతో సోమవారం భేటీ అయ్యారు.
 

global logic company responded positively to put up branch in nizamabad IT Hub says MLC kavitha kms

హైదరాబాద్: ప్రతి జిల్లాలో ఐటీ హబ్‌లు ప్రారంభించాలని తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. ఇందులో భాగంగా నిజామాబాద్‌లో ఇటీవలే ఐటీ హబ్‌ను ప్రారంభించింది. తాజాగా, ఈ ఐటీ హబ్‌లో అంతర్జాతీయంగా పేరొందిన హిటాచీ గ్రూపు సబ్సిడరీ కంపెనీ గ్లోబల్ లాజిక్‌ను స్థాపించాల్సిందిగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆ కంపెనీ ప్రతినిధులను కోరింది. సంస్థకు కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పిస్తామని ఎమ్మెల్సీ కవిత హామీ ఇచ్చారు. దీంతో ఆ కంపెనీ ప్రతినిధులు సానుకూలంగా స్పందించారు. ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, షకీల్ కంపెనీ ప్రతినిధులైన ఆ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ గురు కమకొలను, కంటెంట్ ఇంజినీరింగ్ విభాగం వైస్ ప్రెసిడెంట్ కృష్ణ మోహన్ వీరవల్లిలతో భేటీ సోమవారం భేటీ అయ్యారు.

సోమవారం నాటి భేటీలో వారు ఐటీ హబ్ గురించి సుదీర్ఘంగా చర్చించారు. రవాణా, నీరు, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాలు, శాంతి భద్రతల గురించి కంపెనీ ప్రతినిధులకు కవిత వివరించారు. ఐటీ హబ్ వరకు ఆర్టీసీ బస్సులను వేస్తామని బాజిరెడ్డి గోవర్దన్ తెలిపారు. కంపెనీ ప్రతినిధులు మంగళవారం నిజామాబాద్ ఐటీ హబ్ సందర్శించనున్నారు. 

యూఎస్‌లోని కాలిఫోర్నియాలో ఈ కంపెనీ ప్రధాన కార్యాలయం ఉన్నది. హైదరాబాద్‌లో ఈ కంపెనీకి రెండు క్యాంపస్‌లు ఉన్నాయి. గచ్చిబౌలి, జూబ్లిహిల్స్‌లోని వారి కంపెనీలో ప్రస్తుతం దాదాపు 3 వేల మంది ఉద్యోగులున్నారు.

Also Read: శ్రీవారి లడ్డులో నందిని నెయ్యి మాయం.. కేఎంఎఫ్‌తో ఒప్పందం రద్దుకు టీటీడీ నిర్ణయం

తమ విజ్ఞప్తికి గ్లోబల్ లాజిక్ ప్రతినిదులు సానుకూలంగా స్పందించడం సంతోషం అని ఎమ్మెల్సీ కవిత అన్నారు. స్థానికంగానే యువతకు ఉద్యోగాలు సృష్టించాలనే సీఎం కేసీఆర్, ఐటీ మంత్రి కేటీఆర్ ఆలోచనలతోనే అన్ని జిల్లాల్లో ఐటీ హబ్‌ల  ఏర్పాటు ప్రయత్నాలు చేస్తున్నారని వివరించారు. భవిష్యత్‌లో నిజామాబాద్‌కు మరిన్ని కంపెనీలు వస్తాయని, స్థానిక యువత ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపు ఇచ్చారు. ఇది కేసీఆర్ దార్శనికతకు నిదర్శనం అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios