శ్రీవారి లడ్డులో నందిని నెయ్యి మాయం.. కేఎంఎఫ్‌తో ఒప్పందం రద్దుకు టీటీడీ నిర్ణయం
శ్రీవారి లడ్డులో వచ్చే నెల నుంచి ఆగస్టు 1వ తేదీ నుంచి నందిని నెయ్యి మాయమవుతుంది. నందిని నెయ్యి తయారు చేసే కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ ధరలు పెంచడంతో టీటీడీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. తమకు పాత రేటుకు నెయ్యి అందించాలని టీటీడీ కోరగా.. కేఎంఎఫ్ అందుకు నిరాకరించింది.
అమరావతి: తిరుపతి లడ్డులు ఎంత ఫేమస్సో దేశమంతా తెలుసు. ఈ లడ్డులు అంత టేస్టీగా ఉంటాయి. అయితే, వచ్చే నెల నుంచి తిరుపతి లడ్డుల్లో అంతకు ముందు మనం తిన్న నందిని నెయ్యి ఉండదు. దాని స్థానంలో వేరే కంపెనీ నెయ్యి ఉండొచ్చు. ఎందుకంటే.. కర్ణాటక మిల్క్ ఫెడరేషన్‌తో తిరుమల తిరుపతి దేవస్థానం నెయ్యి కొనుగోలుకు సంబంధించిన ఒప్పందాన్ని రెన్యూవల్ చేయకూడదని నిర్ణయించింది. ఇందుకు ప్రధాన కారణంగా నందిని నెయ్యికి పెరిగిన ధర కనిపిస్తున్నది.
ఈ విషయాన్ని కేఎంఎఫ్ ధ్రువీకరించింది. నందిని నెయ్యి ధరను పెంచారు. ఇక పై తక్కువ ధరకు అడిగే టెండర్ల ప్రక్రియలో పాల్గొనబోమని కేఎంఫ్ స్పష్టం చేసింది. ఇదే తరుణంలో టీటీడీ కూడా నందిని నెయ్యిని వినియోగించకూడదనే తీర్మానం చేసుకున్నట్టు తెలిసింది. అందుకే కేఎంఎఫ్‌తో ఉన్న ఒప్పందాన్ని రెన్యువల్ చేయకూడదని నిర్ణయించుకుంది. ఆగస్టు 1వ తేదీ నుంచి టీటీడీకి నందిని నెయ్యి సరఫరా నిలిచిపోనుంది.
Also Read: వైసీపీకి బీజేపీ ప్రశ్నల వర్షం.. ఈ 9 ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలని డిమాండ్
తాము నాణ్యమైన నెయ్యి తయారు చేస్తున్నామని, ధర తగ్గిస్తే నాణ్యత తగ్గే ముప్పు ఉన్నదని కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ చైర్మన్ భీమా నాయక్ ధ్రువీకరించారు. తిరుమల సహా ఇతర ఆలయాలు లడ్డు తయారీ, ఇతర ప్రసాదాల తయారీకి నందిని నెయ్యి సరఫరాకు ఉద్దేశించిన టెండర్లను తాము పున:సమీక్షిస్తామని తెలిపారు. నాణ్యమైన నెయ్యి కాబట్టే ధర తగ్గించడం కుదరని స్పష్టం చేశారు. తాము పెంచుతున్న రేటు ఆగస్టు 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని వివరించారు. కానీ, తమకు పాత ధరకే సరఫరా చేయాలని టీటీడీ కోరిందని, అందుకు తాము నిరాకరించినట్టు భీమా నాయక్ తెలిపారు. కాబట్టి, ఆగస్టు 1వ తేదీ నుంచి టీటీడీకి నందిని నెయ్యి సరఫరా నిలిచిపోతుందని వివరించారు.