ఇంట్లో భార్య, పిల్లలను పెట్టుకొని మరీ..చాలా మంది తాము ఇంకా బ్రహ్మచారుల్లా బిల్డప్ కొడుతూ ఉంటారు. పెళ్లైన విషయాన్ని దాచిపెట్టి.. మరో అమ్మాయిని లైన్ లో పెడతారు. ఓ వ్యక్తి ఇలానే చేశాడు. కానీ లాక్ డౌన్ అతని భండారం మొత్తం బయటపెట్టింది. 

ఇంతకీ ఏం జరిగిందంటే...వాళ్లిద్దరూ ఓ ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో  పనిచేస్తున్నారు. వారి కొద్దిరోజుల పరిచయం ప్రేమగా మారింది. త్వరలోనే పెళ్లి కూడా చేసుకుందామనుకున్నారు. వీలైనప్పుడల్లా షికార్లు, సరదాలు తీర్చుకున్నారు. ఇంతలో కరోనా కారణంగా ప్రభుత్వం లాక్‌డౌన్‌ ప్రకటించింది. 

దీంతో ఐటీ ఉద్యోగులు ఇంటి నుంచే తమ విధులు నిర్వర్తించడం మొదలుపెట్టారు. ఈ లాక్ డౌన్ కారణంగా ఆ ప్రేమికుల మధ్య గ్యాప్ వచ్చింది. సదరు యువకుడు.. తన ప్రేయసికి కనీసం ఫోన్ కూడా చేయడం లేదు. ఆమె చేస్తే.. ఫోన్ స్విచ్ఛాఫ్ వచ్చింది.

ప్రియుడి దూరంతో ఆమె తట్టుకోలేకపోయింది. అసలు తననెందుకు దూరం పెట్టాడో తెలుసుకోవాలన్న ఆరాటంతో ఎలాగోలా అతడి ఇంటి చిరునామా కనుక్కోగలిగింది. తీరా అతడి ఇంటికి వెళ్లి చూస్తే.. భార్య ఒడిలో తల పెట్టుకుని తాపీగా టీవీ చూస్తున్న తన ప్రియుడు కనిపించాడు. 

షాక్‌ తిన్న సదరు యువతి అతని దుమ్ము దులిపేసింది. విషయం తెలుసుకున్న అతని భార్య కూడా  నిలదీసింది. వారి ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేని ఆ మహానుభావుడు.., ఆత్మహత్య చేసుకుంటానంటూ రోడ్డుపైకి పరుగుతీశాడు. దీంతో మహిళలిద్దరూ  పోలీసులకు సమాచారం అందించగా.. వారు వచ్చి అతడిని కాపాడి, సమస్యను పరిష్కరించారు. 

లాక్ డౌన్ తో ఇలాంటి దొంగ భర్త, దొంగ ప్రియుల భండారాలన్నీ బయటపడుతున్నాయని పోలీసులు చెబుతుండటం గమనార్హం.