Asianet News TeluguAsianet News Telugu

డ్రంక్ అండ్ డ్రైవ్: యువతి వీరంగం, మరో కారు తుక్కుతుక్కు

పోలీసుల డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో విచిత్రమైన సంఘటనలు చోటు చేసుకున్నాయి.

Girl caught for rash driving

హైదరాబాద్‌ : పోలీసుల డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో విచిత్రమైన సంఘటనలు చోటు చేసుకున్నాయి. పోలీసులు శుక్రవారం అర్థరాత్రి నుించి హైదరాబాదులోని బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్ ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. నాలుగు బృందాలుగా విడిపోయి పోలీసులు ఏకకాలంలో తనిఖీలు నిర్వహించారు. 

తనిఖీల్లో భాగంగా 76 కేసులు నమోదు చేయగా.. 32 కార్లు, 44 బైకులను ట్రాఫిక్‌ పోలీసులు సీజ్‌ చేశారు. అయితే పోలీసుల నుంచి తప్పించుకోవడానికి ఓ యువతి వీరంగం సృష్టించింది.

యువతి జూబ్లీహిల్స్‌లోని డైమండ్ హౌస్ వద్ద పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. ఆ సమయంలో ఓ యువతి హ్యుందయ్‌ క్రెట కారులో (టీఎస్‌ 09 ఈయూ 9450) ఆ మార్గంలో వచ్చింది. మద్యం సేవించిందో లేదోనని  బ్రీత్‌ ఎనలైజర్‌తో  పోలీసులు తనిఖీ చేసే ప్రయత్నం చేశారు. అయితే పక్కనే ఉన్న హోండా సిటీ కారును ఢీకొట్టి వేగంగా డ్రైవింగ్‌ చేస్తూ పారిపోయేందుకు ఎత్తు వేసింది. 

ట్రాఫిక్‌ పోలీసులు ఆమెను ఆపే ప్రయత్నం చేసినా ఫలితం దక్కలేదు. అయితే రోడ్డుపై ట్రాఫిక్ జామ్ అవటంతో ఆ యువతి పోలీసులకు చిక్కింది. మద్యం సేవించిందేమోననే ఉద్దేశంతో మరోసారి తనిఖీ చేశారు. ఆల్కాహాల్ శాతం జీరో వచ్చింది. దీంతో యువతి పైన రాష్ డ్రైవింగ్ కేసును నమోదు చేసి కారును సీజ్ చేశారు.

బంజారాహిల్స్‌లో అర్ధరాత్రి ఓ కారు అదుపుతప్పి బీభత్సం సృష్టించింది. కేబీఆర్‌ పార్క్ వైపు నుంచి పంజగుట్ట వైపు వెళ్తున్న కారు మసీదు మలుపు వద్ద అతివేగంతో దూసుకొచ్చింది. వాహనదారులు, పాదచారులు దాన్ని తప్పించుకోవడానికి ప్రయత్నించారు.కారు రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్ ను ఢీకొట్టి పల్టీలు కొట్టింది. దీంతో కారు నుజ్జునుజ్జయింది. 

కారులోని ఎయిర్ బెలూన్లు తెరుచుకోవడంతో అందులో ప్రయాణిస్తున్న ముగ్గురు యువకులు సురక్షితంగా బయటపడ్డారు. ఆ తర్వాత కారును అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. మద్యం మత్తులో కారు నడపడమే ప్రమాదానికి కారణం కావచ్చునని అంటున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios