హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంపై కాంగ్రెసు అధిష్టానం ప్రత్యేక దృష్టి కేంద్రీకరించినట్లు కనిపిస్తోంది. రాష్ట్రంలో ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెసు కాస్తా బలంగా కనిపిస్తోంది. నాయకుల మధ్య సమన్వయం సాధిస్తే తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావును ఎదుర్కోవడం సులభమవుతుందని కాంగ్రెసు అధ్యక్షుడు రాహుల్ గాంధీ భావిస్తున్నట్లు సమాచారం.

అందుకు గులాం నబీ ఆజాద్ సరైన నాయకుడని భావించి ఆయనను తెలంగాణ కాంగ్రెసు వ్యవహారాల ఇంచార్జీగా పంపించాలనే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి ఒకటి రెండు రోజుల్లో ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఆజాద్ రాకతో తెలంగాణలో రాజకీయ సమీకరణలు మారే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. పార్టీ నాయకుల మధ్య విభేదాలు తగ్గించడానికి ఆజాద్ అనుభవం, పరిచయాలు పనికి వస్తాయని భావిస్తున్నారు,

ఇదిలావుంటే, తెలుగుదేశం పార్టీ నుంచి తమ పార్టీలోకి వచ్చిన రేవంత్ రెడ్డికి ప్రచార బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్లు ప్రచారం సాగుతోంది.  కేసిఆర్ ను తన మాటల తూటాలతో ఎదుర్కోగలిగే వాగ్ధాటి రేవంత్ రెడ్డికి ఉందని, అది ప్రచారంలో బాగా పనికి వస్తుందని కాంగ్రెసు అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది.