వసూళ్లలో నెంబర్ వన్ గా నిలిచిన జిహెచ్ఎంసి కేవలం పది రోజుల్లో రూ.188 కోట్ల రాబడి
పెద్ద నోట్ల రద్దుతో చేతిలో చిల్లిగవ్వ లేక జనాల విలవిలలాడుతుంటే.. జిహెచ్ఎంసి మాత్రం కరెన్సీ నోట్లతో కళకళలాడుతోంది.
రద్దయిన పెద్ద నోట్లను కూడా బకాయిలకు , పన్నుల చెల్లింపులకు చెల్లుబాటు అవుతాయని జిహెచ్ఎంసి ప్రకటించడటమే ఇందుకు కారణం.
ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్న జీహెచ్‌ఎంసీ కేవలం పది రోజుల వ్యవధిలో రూ.188 కోట్లు వసూలు చేసి దేశంలో నంబర్ వన్‌గా నిలిచింది. అంతేకాకుండా కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ ప్రశంసలు పొందింది.
పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో పాత నోట్లతో పన్నుల చెల్లింపులు స్వీకరించవచ్చునని ఈనెల 9వ తేదీన కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని జీహెచ్‌ఎంసీ పూర్తిస్థాయిలో ఉపయోగించుకున్నది. ఈ పది రోజుల వ్యవధిలోనే రూ.188 కోట్ల వసూలుతో 211 శాతం పురోగతి సాధించింది. ఈ విషయంలో జిహెచ్ ఎంసి దేశంలో నంబర్ వన్‌గా నిలిచింది.
పాత నోట్ల రద్దు తరువాత దేశంలోని 22 నగరాల్లో పన్ను వసూళ్ల తీరును కేంద్రం సమీక్షించింది. ఈ నెల 19వ తేదీ వరకు పన్నుల వసూలు వివరాలు వెల్లడించింది.
ఇందులో రూ.188కోట్ల వసూలుతో జీహెచ్‌ఎంసీ ఫస్టు ప్లేస్ లో ఉండగా, మహారాష్ట్రలోని తల్వాన్ నగరం రూ.170 కోట్లతో ద్వితీయ స్థానంలో నిలిచింది.
గత ఏడాది నవంబర్‌లో జీహెచ్‌ఎంసీకి పన్నుల రాబడి కింద కేవలం రూ.8 కోట్లు మాత్రమే వసూలు అయ్యాయి.
పాత నోట్లతో పన్నులు తీసుకోవచ్చునని కేంద్రం ప్రకటించిన వెంటనే జిహెచ్ఎంసి యంత్రాంగం కదలింది. కమీషనర్ జనార్దన్‌రెడ్డి అధికారులతో సమావేశమై పన్ను చెల్లింపులపై సూచనలు చేశారు.
జీహెచ్‌ఎంసీ కౌంటర్లు రాత్రి వరకు పనిచేసే విధంగా ఆదేశాలు జారీ చేశారు. మీడియాలో కూడా పన్ను చెల్లింపులపై విసృత ప్రచారం కల్పించారు. దీంతో దేశంలో అత్యధిక స్థాయిలో పన్ను వసూలు చేసిన నగరంగా హైదరాబాద్ నిలిచిపోయింది.
