హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ నినాదానికి తెలంగాణ మంత్రి, తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు రివర్స్ పంచ్ ఇచ్చారు. వోకల్ ఫర్ లోకల్ అంటూ ప్రధాని మోడీ నినాదాన్ని ఆయన తనకు అనుకూలంగా మార్చుకుని చెప్పారు. జిహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో ఏర్పాటైన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఆయన గురువారం మాట్లాడారు. 

నరేంద్ర మోడీ వోకల్ ఫర్ లోకల్ అనే నినాదం ఇచ్చారని, అసలైన లోకల్ తామేనని, తమది ఢిల్లీ పార్టీ కాదని, అసలైన హైరదాబాదు గల్లీ పార్టీ అని కేటీఆర్ అన్నారు. నరేంద్ర మోడీ నినాదానికి రివర్స్ పంచ్ ఇవ్వడం ద్వారా కేటీఆర్ మరోసారి స్థానిక అంశాన్ని జిహెచ్ఎంసీ ఎన్నికల ప్రచార ఎజెండాగా మార్చారు. 

Also Read: పైశాచిక ఆనందం, దుబ్బాక ఓటమికి సమాధానం చెబుతాం: కేటీఆర్

అదే సమయంలో బండి సంజయ్ గత కొద్ది రోజులుగా చేస్తున్న విమర్శలకు సమాధానం కూడా ఇచ్చారు. ఎంఐఎంతో పొత్తు ఉండదని ఆయన స్పష్టం చేశారు. హైదరాబాదు మేయర్ పదవిని మజ్లీస్ కట్టబెట్టడానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్ధపడ్డారని బండి సంజయ్ విమర్శలు చేస్తూ వస్తున్నారు  మేయర్ పదవి ఎంఐఎంకు ఇచ్చే ప్రసక్తి లేదని ఆయన కచ్చితంగానే చెప్పారు. తమ పార్టీకి చెందిన మహిళ మేయర్ పీఠాన్ని అధిష్టిస్తారని ఆయన చెప్పారు. 

గత జిహెచ్ఎంసి ఎన్నికల్లో తమ పార్టీ పాతబస్తీలో ఐదు స్థానాల్లో మాత్రమే గెలిచిందని, ఈసారి పది స్థానాల్లో గెలుస్తామని చెప్పారు. అలా చెప్పడం ద్వారా మజ్లీస్ కు తమకు మధ్య రహస్యమైన అవగాహన కూడా లేదని చెప్పదలుచుకున్నట్లు అర్థమవుతుంది. ఎంఐఎంను తామ ప్రత్యర్థిగా చూస్తామనే అర్థం స్ఫురించే విధంగా ఆయన మాట్లాడారు. 

Also Read: ఎంఐఎంకు మేయర్ పదవెందుకిస్తాం, ఒంటరి పోరు: కేటీఆర్

బండి సంజయ్ ఎంఐఎంను ముందు పెట్టి మాట్లాడడం ద్వారా ఓక వర్గానికి చెందిన ఓటర్లను తమ బిజెపి వైపు మళ్లించుకోవడానికి వ్యూహం పన్ని అమలు చేస్తున్నట్లు అర్థమవుతోంది. ఈ స్థితిలో ఆ వ్యూహాన్ని దెబ్బ కొట్టే ఉద్దేశంతో కేటీఆర్ ఎంఐఎం పట్ల తమ వైఖరిని స్పష్టం చేయదలుచుకున్నట్లు తెలుస్తోంది. తాము 150 డివిజన్లకు పోటీ చేస్తామని కూడా ఆయన చెప్పారు. ఆ రకంగా ఆయన బిజెపిని ఎదుర్కోవడానికి కేటీఆర్ సిద్ధమైనట్లు కనిపిస్తున్నారు.