హైదరాబాద్: జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎంఐఎంను తన ప్రధాన ప్రత్యర్థిగా బిజెపి చూపించే ప్రయత్నం చేసింది. ఎంఐఎంను లక్ష్యంగా చేసుకుని బిజెపి తన దూకుడిని ప్రదర్శించింది. అలా చేయడం వల్లనే అసదుద్దీన్ నాయకత్వంలోని ఎంఐఎం చెక్కు చెదరలేదని భావిస్తున్నారు. గత ఎన్నికల్లో ఎంఐఎం 44 డివిజన్లలో విజయం సాధించింది. తన స్థానాలను ఎంఐఎం నిలబెట్టుకునే పరిస్థితి కనిపిస్తోంది. 

బిజెపి ఎంఐఎంను లక్ష్యంగా ఎంచుకోవడంతో మైనారిటీలు ఏకమైనట్లు కనిపిస్తోంది. వారు గంపగుత్తగా ఎంఐఎంకు ఓటేసినట్లు కనిపిస్తున్నారు. అయితే, టీఆర్ఎస్ సీట్లను మాత్రం బిజెపి గణనీయంగానే కొల్లగొట్టింది. గత ఎన్నికల ఫలితాలను చూస్తే కాంగ్రెసు కూడా కొద్దిగా పుంజుకున్నట్లు కనిపిస్తోంది. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ 99 డివిజన్లలో విజయం సాధించింది. ప్రస్తుతం అది 70 స్థానాలకు పరిమితయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ రకంగా చూస్తే బిజెపి వ్యూహం ఫలితం ఇచ్చినట్లేనని చెప్పవచ్చు.

దాదాపుగా 29 స్థానాలను టీఆర్ఎస్ కోల్పోయే పరిస్థితి కనిపిస్తోంది. ఆ 29 స్థానాలకు మించి బిజెపి ఆధిక్యంలో కొనసాగుతోంది. ఆ 29 స్థానాలను, టీడీపీ స్థానాలను కలుపుకుని బిజెపి 31 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. 

తెలంగాణలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా మారాలనే బిజెపి వ్యూహం ఫలిస్తున్నట్లుగానే కనిపిస్తోంది. దుబ్బాక దూకుడునే బిజెపి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రదర్శించిందని చెప్పవచ్చు. సింగిల్ డిజిట్ నుంచి బిజెపి డబుల్ డిజిట్ కు చేరుకుంటోంది. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బిజెపి విజయం సాధిస్తుందని ఎవరూ భావించలేదు. టీఆర్ఎస్ ను ఏ మేరకు దెబ్బ తీసుకుందనే విషయంపైనే దృష్టి పెట్టారు ఈ రీత్యా చూస్తే బిజెపి టీఆర్ఎస్ ను దెబ్బ తీసినట్లే.

జిహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఎక్కువ స్థానాలను గెలుచుకునే అవకాశం ఉన్నప్పటికీ గతంలో ప్రదర్శించిన బలం మాత్రం గణనీయంగా తగ్గిందని చెప్పవచ్చు. ఆంధ్ర ఓటర్లు టీఆర్ఎస్ వైపు ఉన్నట్లు కనిపిస్తున్నారు. కూకట్ పల్లి శాసనసభ నియోజకవర్గంలోని మొత్తం 20 డివిజన్లలో టీఆర్ఎస్ విజయం సాధించడాన్ని బట్టి ఆ నిర్ధారణకు రావడానికి అవకాశం ఉంది. 

రాను రాను హైదరాబాదులో పోటీ ఎంఐఎంకు, బిజెపికి మధ్య పోటి జరిగే అవకాశాలున్నాయి. వచ్చే శాసనసభ ఎన్నికల్లో బిజెపి టీఆర్ఎస్ కు బలంగా సవాల్ విసిరే అవకాశాలే కనిపిస్తున్నాయి.