హైదరాబాద్: జిహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కే. చంద్రశేఖర రావు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. దుబ్బాక ఉప ఎన్నిక ఓటమి దెబ్బ మంత్రి హరీష్ రావు మీద పడినప్పటికీ జిహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల ప్రభావం మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావుపై పడింది. ఇది కేటీఆర్ మీద మామూలు దెబ్బేమీ కాదు. 

2016లో జరిగిన జిహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ 99 డివిజన్లలో అనూహ్యంగా విజయం సాధించింది. దాంతో కేటీఆర్ గ్రాఫ్ ఒక్కసారిగా శిఖర స్థాయికి చేరుకుంది. ఫలితంగా కేటీఆర్ కు ప్రమోషన్ కూడా లభించింది. కేటీఆర్ కు కేసీఆర్ మున్సిపల్ శాఖను అదనంగా కేటాయించారు. ఆ తర్వాత టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ ను నియమించారు. 

పార్టీపై, ప్రభుత్వంపై కేటీఆర్ పూర్తి పట్టును సాధించారు. దాంతో అప్పటి వరకు టీఆర్ఎస్ వ్యవహారాల్లో కీలక పాత్ర పోషిస్తూ వచ్చిన హరీష్ రావు వెనక్కి వెళ్లారు. ఆయన ఆ సాధారణ ఎమ్మెల్యే స్థాయికి, ఆ తర్వాత ఓ మామూలు మంత్రి స్థాయికి ఒదిగిపోయారు. హరీష్ రావును కట్టడి చేయడానికి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ ఎమ్మెల్యేలకు ఆదేశాలు కూడా జారీ చేశారు. ఎమ్మెల్యేలు ఎవరు కూడా తమ తమ నియోజకవర్గాలను దాటి ఇతర నియోజకవర్గాల్లో జోక్యం చేసుకోకూడదని ఆదేశించారు. 

దాంతో హరీష్ రావు తన నియోజకవర్గానికి మాత్రమే పరిమితమయ్యారు. వివిధ ఎన్నికల్లో తనకు అప్పగించిన బాధ్యతలను మోస్తూ వచ్చారు. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా తనకు అప్పగించిన బాధ్యతను నిర్వహించారు. తనకు అప్పగించిన డివిజన్లలో ఆయన టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించారు. 

దుబ్బాక ఉప ఎన్నిక పరాజయం ప్రభావం హరీష్ రావుపై పడిందని భావించారు. కానీ, అది కేసీఆర్ కు ప్రమాద సంకేతాలను పంపించిందనే విషయాన్ని కేటీఆర్ గానీ కేసీఆర్ గానీ పట్టించుకున్నట్లు లేదు. దుబ్బాక పరాజయానికి తానే బాధ్యత వహిస్తున్నానని హరీ,్ రావు చెప్పుకున్నారు. ఒక రకంగా అది కేసీఆర్ కు హరీష్ రావు సంజాయిషీ ఇవ్వడం వంటిది.

దుబ్బాక పరాజయంతో హరీష్ రావు పూర్తిగా పార్టీలో కార్నర్ అయినట్లు భావించారు. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో విజయబావుటా ఎగురేస్తే తనకు తిరుగు ఉండదని కేటీఆర్ భావించారు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో విజయం సాధించి తీరుతామనే అతి విశ్వాసాన్ని కూడా కేటీఆర్ ప్రదర్శించారు. ప్రచారంలో ఆయన అభ్యర్థుల పట్ల వ్యవహరించిన తీరు దీనికి తార్కారణం. 

జిహెచ్ఎంసీ ఎన్నికల్లో విజయం సాధించి ఉంటే కచ్చితంగా కేటీఆర్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి ఉండేవారనేది అందరూ చెప్పే విషయం. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో పరాజయంతో కేటీఆర్ ప్రమోషన్ కు బ్రేకులు పడే అవకాశం ఉంది. దుబ్బాక ఎన్నికల్లో కేసీఆర్ గానీ కేటీఆర్ గానీ జోక్యం చేసుకోలేదు. కేసీఆర్ ఒక్కసారైనా ప్రచారానికి వెళ్లి ఉంటే పరిస్థితి మరో విధంగా ఉండేదని అంటున్నారు. హరీష్ రావుకు పరీక్ష పెట్టి చేజేతులా దుబ్బాకలో ఓటమికి కారణమయ్యారనే అభిప్రాయం ఉంది.

హరీష్ రావును పార్టీలో ఏమీ కాకుండా చేయడం వల్లనే టీఆర్ఎస్ దెబ్బ తిన్నదనే అభిప్రాయం కూడా ఉంది. వ్యూహాలను రచించి, అమలు చేయడంలో హరీష్ రావుది అందె వేసిన చేయి. గత ఎన్నికల్లో కూడా ఆయన కీలకమైన శాసనసభా స్థానాల్లో నిర్వహించిన పాత్ర అందరికీ తెలిసిందే. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో హరీష్ రావును తగిన విధంగా వాడుకోకపోవడం వల్ల కూడా ఈ స్థితి వచ్చిందని అంటున్నారు. 

హైదరాబాదులోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన కేసీఆర్ ప్రచార సభకు హరీష్ రావుకు ఆహ్వానం కూడా వెళ్లలేదని అంటున్నారు. హరీష్ రావు లేని విషయాన్ని ప్రజలు గమనించే ఉంటారు. పార్టీ కార్యర్తలు దాన్ని తీవ్రమైన విషయంగానే పరిగణనలోకి తీసుకుని ఉంటారు .కేటీఆర్ మితిమీరిన విశ్వాసం, హరీష్ రావును నిష్క్రియాపరుడ్ని చేయడం టీఆర్ఎస్ ప్రస్తుత స్థితికి కారణమనేది బలంగా వినిపిస్తున్న మాట. ఏమైనా, ప్రస్తుత పరిణామం టీఆర్ఎస్ లో తీవ్రమైన పరిస్థితికి దారి తీసినా ఆశ్చర్యం లేదనే మాట కూడా వినిపిస్తోంది.