హైదరాబాద్:శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలోకి బయట నుండి వాటర్ వచ్చే అవకాశం లేదని జెన్ కో సీఎండీ ప్రభాకర్ రావు స్పష్టం చేశారు. ఈ నెల 20వ తేదీన జరిగిన అగ్ని ప్రమాదంపై విచారణ కమిటీ లోతుగా దర్యాప్తు చేస్తోందని ఆయన తెలిపారు.

ఆదివారం నాడు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ ఘటనలో ఏడుగురు ఇంజనీర్లు, ఇద్దరు ఓ బ్యాటరీ కంపెనీ ప్రతినిధులు మరణించడం చాలా బాధాకరమన్నారు. అగ్ని ప్రమాదం సమయంలో యూనిట్స్ ట్రిప్ కావాల్సి ఉంది. కానీ ఎందుకు ఆటోమెటిక్ గా ట్రిప్ కాలేదో విచారణ చేస్తున్నామన్నారు.

సంఘటన జరిగిన కొద్ది గంటల్లోనే తనతో పాటు మంత్రి జగదీష్ రెడ్డి సంఘటనస్థలానికి చేరుకొన్నట్టుగా ఆయన గుర్తు చేశారు. రాత్రి మొత్తం రెస్క్యూ ఆపరేషన్ చేసినట్టుగా ఆయన చెప్పారు. కానీ తమ నుండి సాధ్యం కాకపోవడంతో ఎన్డీఆర్ఎఫ్, సీఐఎస్ఎఫ్ బృందాలను పిలిచినట్టుగా ఆయన తెలిపారు. 

అగ్ని ప్రమాదంతో పవర్ కట్ అయిందన్నారు. దీంతో లోపల అంధకారంగా మారిందన్నారు. అంతేకాదు అగ్ని ప్రమాదం కారణంగా వ్యాపించిన పొగతో ఇంజనీర్లకు ఆక్సిజన్ లభించలేదని సీఎండీ అభిప్రాయపడ్డారు. 

పవర్ పోవడంతో వెంటిలేషన్ కూడ ఆగిపోయిందన్నారు. అంతేకాదు ఎమర్జెన్సీ తలుపులు కూడ తెరుచుకోలేదని ఆయన అభిప్రాయపడ్డారు. ఏ కారణంగా ఈ సమస్య తలెత్తిందో అర్ధం కావడం లేదన్నారు. 

గత 30 రోజుల నుండి ప్రతి రోజుకు 128 మెగా వాట్స్ విద్యుత్ ఉత్పత్తి జరుగుతున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. పవర్ జనరేషన్ ఆపినట్టు వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. 

also read:శ్రీశైలం అగ్ని ప్రమాదం: అయిపాయే మన పని... ఏఈ మోహన్ తో మరో ఏఈ సుందర్ చివరి మాటలు

గతంలో కూడా ఎన్టీపీసీ లో బాయిలర్ బ్లాస్ట్ అయి  దాదాపు 30 చనిపోయారన్నారు. తమిళనాడు లో కూడా ఇలాంటి ఘటనే జరిగిందన్నారు. 
ప్లాంట్ లోపలికి నీరు వచ్చేది లేదు ఎలాంటి ఇబ్బంది కూడా లేదని ఆయన చెప్పారు. 

సాగర్ లో కూడా నీటి ప్రవాహం ఉన్నది అక్కడ కూడా విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది.వర్షాలు ఎక్కువగా ఉండడం తో వ్యవసాయం కు  డిమాండ్ తగ్గిందని ఆయన వివరించారు. ఈ ప్రమాదంపై తాము కూడా ఇంటర్నల్ కమిటీ వేశామన్నారు. ఈ కమిటీ కూడ ప్రమాదానికి గల కారణాలను అన్వేషిస్తోందని ఆయన వివరించారు.