వివాహేతర సంబంధాలకు అడ్డు తొలగించుకోవడానికి ప్రయత్నిస్తున్నవారిని, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారిని ఆసరా చేసుకుని హత్యలు చేసి బీమా సొమ్ములు కాజేస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. 

నల్లగొండ: మనుషులను చంపేసి డబ్బులు సంపాదించే ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. అమాయకుల పేరిట జీవిత బీమా పాలసీలు చేయించి, వారిని చంపేసి, బీమా సొమ్ము కాజేసే ముఠా పోలీసులకు చిక్కింది. ఈ ముఠా ఇప్పటి వరకు 8 మందిని చంపేసింది. దాదాపు కోటిన్నర రూపాయల మేరకు కాజేసింది. ఈ వ్యవహారంలో అమాయకుల కుటుంబ సభ్యులతో పాటు బీమా కంపెనీల ప్రతినిధులు కూడా పాలు పంచుకున్నట్లు తేలింది. 

బీమా సొమ్ము పంపకాల్లో తలెత్తిన వివాదంతో ముఠా గుట్టు రట్టయింది. పోలీసులు ఐదుగురు ముఠా సభ్యులను అరెస్టు చేశారు. నల్లగొండ ఎస్పీ రంగనాథ్ మంగళవారం ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. 

నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం రాళ్లవాగు తండాకు చెందిన ధీరావత్ రాజు నాయక్ జిల్లా కేంద్రంోలని గోల్టెన్ ట్రస్ట్ ఫైనాన్స్ సర్వీస్ లో ఏజెంటుగా పనిచేస్తూ ఉండేవాడు. 2013లో అతని సమీప బంధువు శూన్యపహాడ్ కు చెందిన సబావత్ సక్రియా పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే, మృతిని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించి, అతని భార్య పేరిట రూ.1.40 లక్షల బీమా పాలసీ పొందారు. ఇందులో రాజు నాయక్ కీలక పాత్ర పోషించాడు. 

ఆ క్రమంలో బీమా సొమ్మును కాజేసేందుకు ఆ పథకం వేశాడు. తన మిత్రులుకంచి శివ, మందారి సాయి సంపత్, వేముల కొండల్ లను సభ్యులుగా ఏర్పాటు చేసుకున్నాడు. అనారోగ్యంతో బాధపడుతున్నవారు, వివాహేతర సంబంధాల గొడవలతో విసిగివేసారిని వారిని లక్ష్యంగా చేసుకుని కార్యకలాపాలు ప్రారంభించాడు.

ఆ ముఠా మిర్యాలగుడా, దామరచర్ల మండల పరిధిలో అనారోగ్య సమస్యలున్న వారిని, వివాహేతర సంబంధాలను అడ్డు తొలగించుకనే ఉద్దేశంతో ఉన్నవారిని సంప్రదిస్తుంది. హత్య చేయాల్సిన వ్యక్తి కుటుంబ సభ్యులతో ఒప్పంద చేసుకుంటుంది. ఆ వ్యక్తి పేరిట ముఠా సభ్యులే వివిధ కంపెనీల బీమా పాలసీలు కడుతారు. కొద్ది నెలల తర్వాత లేదా ఏడాది తర్వాత ఆ వ్యక్తిని చంపేస్తారు. వచ్చిన సొమ్మును కుటుంబ సభ్యులతో కలిసి పంచుకుంటారు.