నేడే వినాయక నిమజ్జనం.. హైదరాబాద్ మెట్రో రైళ్ల సేవలు పొడిగింపు..
గణేష్ విగ్రహాల నిమజ్జనం సందర్బంగా హైదరాబాద్ మెట్రో తన సేవలు పొడిగించింది. మెట్రో రైళ్లను శుక్రవారం ఉదయం 6 గం.లనుంచి అర్థరాత్రి 2 గంటలవరకు నడపనుంది.
హైదరాబాద్ : గణేష్ నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్ మెట్రో ప్రత్యేక సేవలు అందించనున్నట్లు ప్రకటించింది. శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి అర్థరాత్రి 2 గంటల వరకు మెట్రో రైలు సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఈ మేరకు మెట్రో ఎండీ ఓ ప్రకటన విడుదల చేశారు. ‘గణేష్ నిమజ్జనం రోజున ప్రయాణికుల రద్దీ దృష్ట్యా మెట్రోరైలు సమయాన్ని పొడిగిస్తున్నాం. చివరి మెట్రో రైలు సెప్టెంబర్ 10న ఒంటిగంటకు బయలుదేరి దాదాపు రెండు గంటల సమయంలో సంబంధిత స్టేషన్లకు చేరుకుంటుంది. తిరిగి మరుసటి రోజు ఉదయం ఆరుగంటల నుంచి మెట్రో సేవలు యధావిధిగా నడుస్తాయి. ప్రయాణికులు సిబ్బందికి సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం’ అని ఆయన పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా, హైదరాబాదులో వినాయక విగ్రహాల నిమజ్జనం కోసం జిహెచ్ఎంసి అన్ని ఏర్పాట్లు చేసింది. శుక్రవారం ట్యాంక్ బండ్ లో వినాయక విగ్రహాలను నిమజ్జనం చేయనున్నారు. నిమజ్జనం కోసం ట్యాంక్బండ్పై జిహెచ్ఎంసి అధికారులు అవసరమైన క్రేన్లను ఏర్పాటు చేశారు. మట్టి వినాయక విగ్రహాలతో పాటు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసిన విగ్రహాలను కూడా ట్యాంక్ బండ్ నిమజ్జనం చేస్తారు. ట్యాంక్బండ్ పై 15, ఎన్టీఆర్ మార్కులు తొమ్మిది, పివి మార్గంలో 8 క్రేన్ లు ఏర్పాటు చేశారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 354 కిలోమీటర్ల మేర గణేష్ విగ్రహాల శోభ యాత్ర సాగనుంది. ట్యాంక్ బండ్ తో పాటు 74 ప్రాంతాల్లో జిహెచ్ఎంసి బేబీ పాండ్స్ ను కూడా ఏర్పాటు చేసింది.
రేపు ట్యాంక్ బండ్ లో వినాయక విగ్రహల నిమజ్జనం: మూడు జిల్లాలకు సెలవులు
హైదరాబాద్ పాతబస్తీ పరిధిలోని సౌత్ జోన్ లో సుమారు 1700 వినాయక విగ్రహాలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో సుమారు 2500 మందితో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. పాతబస్తీ లోని కొన్ని సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు గట్టి నిఘాను ఏర్పాటు చేశారు. గణేష్ విగ్రహాల నిమజ్జనం 10వేల మంది జిహెచ్ఎంసి సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. గణేష్ విగ్రహాల నిమజ్జనంలో కార్యక్రమ పర్యవేక్షణకు 168 మంది అధికారులను నియమించారు. ట్యాంక్ బండ్ వద్ద వినాయక విగ్రహాల నిమజ్జనం ఏర్పాట్లను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, జిహెచ్ఎంసి మేయర్ గద్వాల్ విజయలక్ష్మి లు బుధవారం పరిశీలించారు.
జిహెచ్ఎంసి గణేష్ యాక్షన్ టీంలను ఏర్పాటు చేసింది. ప్రతీ టీంలో 23 మంది సభ్యులు ఉంటారు. మూడు నుంచి నాలుగు కిలోమీటర్ల పరిధిలో గణేష్ విగ్రహాల నిమజ్జనం కోసం 3 షిప్టుల వారీగా విధులు నిర్వహించనున్నారు. నేడు గణేష్ విగ్రహాల నిమజ్జనం నేపథ్యంలో ట్యాంక్బండ్పై వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించారు. ఇక, ట్యాంక్ బండ్ లో గణేష్ విగ్రహాలు నిమజ్జనానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ భాగ్యనగర్ ఉత్సవ సమితి గతంలో డిమాండ్ చేసింది. ఈ విషయమై బైక్ ర్యాలీకి పూనుకుంది. కానీ, బైక్ ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు.