హైదరాబాద్‌లో శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో పెద్ద మొత్తంగా అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని పట్టుకున్నారు. బంగారాన్ని పేస్టుగా మార్చి కాలి బూటు, హ్యాండ్ బ్యాగుల్లో దాచుకుని తరలిస్తుండగా పట్టుకున్నారు. సుమారు 2.65 కిలోల బంగారాన్ని వారు స్వాధీనం చేసుకున్నారు.

హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని ప్రతిష్టాత్మక శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీ మొత్తంలో బంగారం పట్టుబడింది. దుబాయ్ నుంచి అక్రమంగా తరలిస్తున్న 2,654 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు చాకచక్యంగా స్వాధీనం చేసుకున్నారు. గోల్డ్ స్మగ్లర్లు రోజు రోజుకు నూతన విధానాల్లో అక్రమాలకు పాల్పడుతున్నారు. సరికొత్త రూపాల్లో బంగారాన్ని అక్రమంగా మన దేశంలోకి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే, కస్టమ్స్ అధికారులు చేపట్టే తనిఖీల్లో వీరు పట్టుబడిపోతుండటం దాదాపు ఖాయమే. ఎన్నిసార్లు ఈ గోల్డ్ స్మగ్లర్లు పట్టుబడినా.. ఇలాంటి అక్రమ తరలింపు ఘటనలు తగ్గిన దాఖలాలు కనిపించడం లేదు.

తాజాగా, గురువారం రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఇందులో స్మగ్లర్లు బంగారాన్ని పేస్టులా మార్చి బూట్లలో దాచుకున్నట్టు గుర్తించారు. దుబాయ్ నుంచి ఎయిర్‌పోర్టులో దిగిన ఓ మహిళ 434 గ్రాముల బంగారాన్ని పేస్టుగా మార్చి తన కాలి బూటులో దాచుకుంది. కస్టమ్స్ అధికారులకు ఆమె తీరు కొంత అనుమానంగా కనిపించడంతో పరిశీలించారు. ఆమె కాలి బూటులో బంగారాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. కాగా, మరో వ్యక్తి బంగారాన్ని తన వీపుపై అతికించాడు. ఇది 98 గ్రాములుగా అధికారులు గుర్తించారు. వీరితోపాటు మరో ఎనిమిది మంది ప్రయాణికులు ఒక్కొక్కరు దాదాపు 232 గ్రామలు చొప్పున బంగారాన్ని తమ హ్యాండ్ బ్యాగుల్లో దాచుకుని అక్రమంగా తరలిస్తు పట్టుబడిపోయారు.

గురువారం ఒక్క రోజే వీరి నుంచి కస్టమ్స్ అధికారులు 2,654 గ్రామలు బంగారం అంటే సుమారు 2.65 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు రూ. 1.65గా ఉంటుందని వివరించారు.