హుస్సేన్ సాగర్‌లో కొనసాగుతున్న గణేష్ విగ్రహాల నిమజ్జనం: నగరంలో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జాం
హుస్సేన్ సాగర్ లో గణేష్ విగ్రహాల నిమజ్జనం కొనసాగుతుంది. నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జాం నెలకొంది. వినాయక విగ్రహాల శోభాయాత్ర సాగే మార్గంలో కాకుండా ప్రత్యామ్నాయ మార్గంలో వెళ్లాలని వాహనదారులకు పోలీసులు సూచించారు.
హైదరాబాద్:హుస్సేన్‌సాగర్ లో గణేష్ విగ్రహాల నిమజ్జనం కొనసాగుతుంది. శుక్రవారంనాడు మధ్యాహ్నం వరకు వినాయక విగ్రహాల నిమజ్జనం కొనసాగే అవకాశం ఉంది. హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాల్లో వినాయక విగ్రహాల నిమజ్జనం కోసం వాహనాలు బారులు తీరాయి. దీంతో నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ నిలిచిపోయింది. బషీర్ బాగ్, ఆబిడ్స్, లక్డీకపూల్ నుండి ట్యాంక్ బండ్ వరకు వినాయక విగ్రహాల నిమజ్జనం కోసం వాహనాలు వస్తున్నాయి. ఇవాళ మధ్యాహ్నం వరకు గణేష్ విగ్రహాల నిమజ్జనం పూర్తయ్యే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
గణేష్ విగ్రహాల నిమజ్జనం కోసం వచ్చే వాహానాలకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా పోలీసులు ఏర్పాట్లు చేశారు.
వినాయక విగ్రహాల శోభాయాత్ర సాగే మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతున్నాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శుక్రవారం నాడు ఉదయం వరకు 40 వేల వినాయక విగ్రహాలను నిమజ్జనం చేసినట్టుగా అధికారులు వెల్లడించారు.
లక్డీకపూల్, టెలిఫోన్ భవన్,తెలుగుతల్లి ఫ్లైఓవర్ మార్గంలో నిమజ్జన శోభాయాత్ర కొనసాగుతుంది. దీంతో ఈ మార్గంలో వాహనదారులు రావొద్దని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు. కూకట్ పల్లి నుండి వచ్చే వాహనాలను అమీర్ పేట నుండి మళ్లిస్తున్నారు. తెలుగుతల్లి ఫ్లైఓవర్, లక్డీకపూల్, సికింద్రాబాద్, ట్యాంక్ బండ్, బషీర్ బాగ్ వైపు ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతున్నాయి.
ఈ నెల 28వ తేదీన ఉదయం నుండి గణేష్ విగ్రహాల నిమజ్జనం కొనసాగుతుంది. నిమజ్జనానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు గాను ఖైరతాబాద్ వినాయక విగ్రహాన్ని నిన్న మధ్యాహ్నమే ట్యాంక్ బండ్ లో నిమజ్జనం చేశారు.