హైదరాబాద్: తమపై రోగుల సహాయకులు చేస్తున్న దాడులను నిరసిస్తూ గాంధీ హాస్పిటల్ లో విధులు నిర్వర్తిస్తున్న జూనియర్ డాక్టర్లు ధర్నాకు దిగిన విషయం తెలిసిందే. కరోనా విజృంభిస్తున్న ఈ కీలక సమయంలో వైద్యం చేయకుండా డాక్టర్లు ధర్నాకు దిగడంతో సర్కార్ వెంటనే స్పందించింది. డాక్టర్లతో  చర్చలు జరిపిన వైద్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ వారితో సమ్మె విరమింపజేశారు. మంత్రి హామీ మేరకు తిరిగి విధుల్లోకి చేరుతున్నట్లు జూనియర్ డాక్టర్లు ప్రకటించారు. 

కరోనా వైరస్ సోకి గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగి ఈ నెల 9వ తేదీన మృతి చెందాడు. దీంతో కరోనాతో మరణించిన రోగి బంధువులు జూనియర్ డాక్టర్లపై దాడికి దిగారు.  ఈ ఘటనలో ఇద్దరు జూనియర్ డాక్టర్లకు స్వల్పంగా గాయపడ్డారు.

దీంతో  తమపై జరిగిన దాడిని నిరసిస్తూ గాంధీ ఆస్పత్రిలో జూనియర్ డాక్టర్లు మంగళవారం రాత్రి మెరుపు ధర్నాకు దిగారు. పోలీసులు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. గతంలోనూ తమపై దాడి జరిగిందని, భద్రత కల్పిస్తామన్న ప్రభుత్వ ప్రకటన అమలుకు నోచుకోలేదని, ఇలాంటి భయానక పరిస్థితుల్లో తాము డ్యూటీ చేయలేమని జూడాలు అన్నారు.

read more  కరోనాతో పేషంట్ చనిపోయాడని.. జూనియర్ డాక్టర్లపై అటెండెంట్ల వీరంగం..

 కేవలం గాంధీ ఆసుపత్రిలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తగా పలు చోట్ల ఆసుపత్రుల ముందు జూనియర్ డాక్టర్లు ఆందోళనకు దిగారు.జూనియర్ డాక్టర్లపై దాడిని నిరసిస్తూ  ఆదిలాబాద్, వరంగల్, గాంధీ ఆసుపత్రుల ముందు జూనియర్ డాక్టర్లు ఆందోళనకు దిగారు. ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రి వద్ద జూనియర్ డాక్టర్లు గంట పాటు విధులు బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. ఓపి నుండి రిమ్స్ వరకు ర్యాలీ నిర్వహించారు.

వరంగల్ ఎంజీఎం ముందు జూనియర్ డాక్టర్లు ధర్నాకు దిగారు. విధులు బహిష్కరించారు. డాక్టర్లపై దాడి చేసిన వారిని అరెస్ట్ చేయాలని కోరారు. గాంధీ ఆసుపత్రిలో కూడ జూనియర్ డాక్టర్లు నిరసనకు దిగారు. 

గతంలో కూడ గాంధీ, ఉస్మానియా ఆసుపత్రుల్లో కూడ జూనియర్ డాక్టర్లపై రోగి బంధువులు దాడులకు దిగారు.ఈ ఘటనల్లో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. డాక్టర్లపై దాడులు చేస్తే సహించమని ప్రభుత్వం హెచ్చరించిన విషయం తెలిసిందే. 

జూనియర్ డాక్టర్లపై దాడి చేసినవారిపై కేసు

జూనియర్ డాక్టర్లపై దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షిస్తామని హైద్రాబాద్ సీపీ అంజనీకుమార్ చెప్పారు. గాంధీ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్లపై దాడికి పాల్పడిన వారిపై కేసు నమోదు చేశామన్నారు. డాక్టర్లపై దాడి చేస్తే ఉపేక్షించబోమన్నారు.