Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణ అసెంబ్లీ నిరవధిక వాయిదా .. సభ ఎన్ని రోజులు జరిగింది, ఎంతమంది మాట్లాడరంటే..?

తెలంగాణ అసెంబ్లీని నిరవధిక వాయిదా వేశారు  స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. ఈ నెల 9వ తేదీన అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవ్వగా.. సెలవు దినాలు మినహాయిస్తే మొత్తం 6 రోజుల పాటు సభ జరిగింది. ఆరు రోజుల 26 గంటల 33 నిమిషాల పాటు సమావేశాలు జరిగాయి. అసెంబ్లీలో 19 మంది సభ్యులు ప్రసంగాలు చేయగా..  రెండు అంశాలపై స్వల్పకాలిక చర్చలు జరిగాయి. 

gaddam prasad kumar Telangana State Legislative Assembly adjourned sine die ksp
Author
First Published Dec 21, 2023, 8:43 PM IST

తెలంగాణ అసెంబ్లీని నిరవధిక వాయిదా వేశారు  స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. ఈ నెల 9వ తేదీన అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవ్వగా.. సెలవు దినాలు మినహాయిస్తే మొత్తం 6 రోజుల పాటు సభ జరిగింది. ఆరు రోజుల 26 గంటల 33 నిమిషాల పాటు సమావేశాలు జరిగాయి. అసెంబ్లీలో 19 మంది సభ్యులు ప్రసంగాలు చేయగా..  రెండు అంశాలపై స్వల్పకాలిక చర్చలు జరిగాయి. 

ఇకపోతే.. ఇవాళ జరిగిన అసెంబ్లీ సెషన్‌లో యాదాద్రి ప్రాజెక్ట్, ఛత్తీస్‌గఢ్‌లో విద్యుత్ ఒప్పందం, భద్రాద్రి ప్రాజెక్ట్‌లో కాలం చెల్లిన సబ్ క్రిటికల్ టెక్నాలజీ వాడకంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విచారణకు ఆదేశించారు. తనపై వస్తున్న ఆరోపణలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి .. స్పీకర్‌ను కోరారు. ఈ క్రమంలోనే జగదీష్ రెడ్డి సవాల్‌ను సీఎం రేవంత్ రెడ్డి స్వీకరించారు. 24 గంటల విద్యుత్‌పై అఖిలపక్షంతో నిజ నిర్ధారణ కమిటీ వేస్తున్నట్లు ప్రకటించారు. 

అనంతరం అసెంబ్లీలో విద్యుత్ బిల్లుల బకాయిలపై వాడివేడి చర్చ జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగిస్తూ.. విద్యుత్ బిల్లుల ఎగవేత విషయంలో సిద్ధిపేట మొదటి స్థానంలో వుండగా.. రెండు, మూడు స్థానాల్లో గజ్వేల్, హైదరాబాద్ సౌత్ వున్నాయని రేవంత్ రెడ్డి వెల్లడించారు. సిద్ధిపేట, గజ్వేల్, హైదరాబాద్ సౌత్ నుంచి గెలిచిన వారే గత పదేళ్లుగా తెలంగాణను పాలించారని ఆయన చురకలంటించారు.

బీఆర్ఎస్, ఎంఐఎం వేరు వేరు కాదని.. ఇద్దరూ కలిసే రాష్ట్రాన్ని పాలించారని రేవంత్ రెడ్డి దుయ్యబట్టారు. మైనారిటీల అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి వుందని .. ఓల్డ్ సిటీ, న్యూసిటీ అనే తేడా మాకు లేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అదే పనిగా ఎంఐఎం పొగుడుతూ వుంటే వినేందుకు తాము సిద్ధంగా లేమని రేవంత్ తేల్చిచెప్పారు. 

ఎంఐఎం కేసీఆర్‌ను రక్షించే పని ఎందుకు చేస్తోందని సీఎం ప్రశ్నించారు. హైదరాబాద్ సౌత్‌లో 61 శాతం బకాయిలు వున్నాయని.. బీఆర్ఎస్ , మజ్లిస్ మిత్రులని కేసీఆర్ చెప్పారని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. కామారెడ్డిలో షబ్బీర్ అలీని ఓడించడానికి అక్బర్, కేసీఆర్‌తో కలిసి పనిచేశారని .. కవ్వంపల్లి లాంటి దళిత ఎమ్మెల్యేను అవమానించడం ఎంఐఎంకు తగదని సీఎం హితవు పలికారు. మా ప్రాంతంలో వున్న విద్యుత్ బకాయిలు చెల్లించే బాధ్యత వహిస్తామని ఎందుకు చెప్పరని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. జగదీష్ రెడ్డి కరెంట్ కోసం ఆందోళనలు జరగలేదని చెబుతున్నారని.. కామారెడ్డి, సూర్యాపేటలలో 24 గంటలు కరెంట్ ఇవ్వలేదని రైతులు ఆందోళన చేశారని ముఖ్యమంత్రి గుర్తుచేశారు. 

అక్బరుద్దీన్ ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారని.. ఆయన అనుభవాన్ని పరిగణనలోనికి తీసుకుని ప్రొటెం స్పీకర్‌గా ఎంపిక చేశామని రేవంత్ రెడ్డి వెల్లడించారు. అక్బరుద్దీన్ మజ్లిస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే మాత్రమేనని.. ముస్లిలందరికీ నాయకుడు కాదని సీఎం పేర్కొన్నారు. శ్రీశైలం ఎడమ కాలువ సొరంగం బ్లాస్ట్ అయ్యి 9 మంది చనిపోయారని.. ఈ ఘటనలో ఏఈ ఫాతిమా చనిపోయిందని ముఖ్యమంత్రి చెప్పారు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios