పండ్లు కొని డబ్బులు ఇవ్వమన్నందుకు వ్యాపారిని హత్య చేసిన దారుణ ఘటన హైదరాబాద్ లో కలకలం రేపింది. నగరంలోని కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్ పరిధి ప్రగతినగర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. 

శాకీబ్ అలీ(30) అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఈనెల 1న ఈ హత్య జరిగింది. ఆ రోజు ప్రగతి నగర్ రోడ్డులో బండిపై పండ్ల వ్యాపారం చేసుకుంటున్న శాకీబ్  వద్దకు ఓ గుర్తుతెలియని వ్యక్తి పండ్లను కొనేందుకు వచ్చాడు. 

ద్రాక్ష పండ్లను కొన్నాడు. కానీ డబ్బులు ఇచ్చేందుకు వ్యక్తి నిరాకరించాడు. దీంతో కొన్న తరువాత పండ్లకు డబ్బులు ఇవ్వాలంటూ ఆ వ్యక్తిని శాకీబ్ అడిగాడు. దీంతో కోపానికి వచ్చిన ఆ వినియోగ దారుడు మరో ముగ్గురితో కలిసి శాకీబ్‌పై దాడి చేశాడు. 

ఈ దాడిలో శాకీబ్ అలీ తీవ్రంగా గాయపడ్డాడు. దాడి తరువాత ఆస్పత్రిలో చేరిన శాకీబ్ అలీ చికిత్స పొందుతూ ఈనెల 3న మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.